ఐపీఎల్ 2023 13వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై సంచలన విజయం సాధించింది. చివరి ఓవర్లో 5 సిక్సర్లు బాది జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించి చరిత్ర పుటల్లో తన పేరును చిరస్థాయిగా నిలిపిన రింకూ సింగ్ హీరో ఆఫ్ ది మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. చేధనలో కేకేఆర్ బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ 83, కెప్టెన్ నితీష్ రాణా 45 పరుగులు చేశారు.
చివర్లో రింకూ సింగ్ గుజరాత్ నడ్డి విరిచాడు. 21 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేసి కేకేఆర్‌కు చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించాడు. చివరివరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. ఆఖరి బంతికి ఆ జట్టుకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అయితే రింకూ సింగ్ పోరాటం ముందు రషీద్ హ్యాట్రిక్ నిలవలేదు. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 29 పరుగులు చేయాల్సి ఉంది. తొలి బంతికి ఉమేష్ యాదవ్ సింగిల్ తీశాడు .. ఆ తర్వాత రింకూ షో మొదలైంది. యశ్ దయాల్‌పై విరుచుకుపడి రింకూ సింగ్ చివరి ఐదు బంతుల్లో సిక్సర్లు కొట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ కు విజయాన్ని అందించాడు.