ఘోర ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే..?
Kohli pins blame on 'lack of intent' from batsmen. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో
By Medi Samrat
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలై.. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనకంజలో నిలిచింది. కాగా.. రెండో ఇన్నింగ్స్ భారత బ్యాట్స్‌మెన్లు సమిష్టిగా విఫలమై 36 పరుగులు మాత్రమే చేశారు. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఓ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యత్ప స్కోరు.
కాగా.. ఈ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఓటమి బాధను వర్ణించడానికి మాటలు రావడం లేదన్నాడు. మూడో రోజు బ్యాట్స్‌మెన్ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేదని, నిజానికీ ఓటమి తనను తీవ్రంగా బాధిస్తోందని అన్నాడు. తొలి రెండు రోజులు బాగా ఆడామన్నాడు. మూడో రోజు 60 పరుగుల ఆధిక్యంతో వచ్చి మేము.. ఓ గంట పేలవమైన ఆట కారణంగా దారుణమైన స్థితికి చేరుకున్నామని తెలిపాడు. మరింత తీవ్రతతో ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆసీస్ బౌలర్లపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లానే లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా బౌలింగ్ వేశారని, ఆశావహ ధోరణి కూడా వారి విజయానికి బాటలు వేసిందని అన్నాడు. ఈ ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకుమన్నాడు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టులో టీమ్ఇండియా బలంగా పుంజుకుంటుదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
కాగా.. చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరమవుతున్న సంగతి తెలిసిందే. విరాట్ సతీమణి అనుష్క బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో కోహ్లీ భారత్ రానున్నాడు. దీంతో మిగతా టెస్టులకు కోహ్లీ అందుబాటులో ఉండడు. రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.