మరో 38 పరుగులు చేస్తే.. దిగ్గజాల సరసన విరాట్
Kohli 38 Runs Away From Joining India Legends In Elite List.పరుగుల యంత్రం, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన
By తోట వంశీ కుమార్
పరుగుల యంత్రం, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం లంకతో ప్రారంభమయ్యే తొలి టెస్టు.. కోహ్లీ కెరీర్‌లో 100వ మ్యాచ్ కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా తరుపున వందో టెస్టు ఆడనున్న 12వ ఆటగాడిగా కోహ్లీ నిలనున్నాడు. ఈ మ్యాచ్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. 50 శాతం మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. దీంతో కోహ్లీ వందో మ్యాచ్ చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరనుంది.
ఇదిలా ఉంటే.. వందో టెస్టులో కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. విరాట్ ఇంకో 38 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్‌లో 8వేల పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. సచిన్ టెండూల్కర్(15,921), రాహుల్ ద్రావిడ్(13,298), సునీల్ గవాస్కర్(10,122), వీరేంద్ర సెహ్వాగ్(8,588), లక్ష్మణ్(8,781) మాత్రమే కోహ్లీ కంటే ముందు ఉన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 99 టెస్టుల్లో 7,962 పరుగులు చేశాడు.
శతకం చేసేనా..
అన్ని ఫార్మాట్‌లలో కలిపి కోహ్లీ శతకం చేసి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తోంది. దీంతో తన కెరీర్‌లో మైలురాయి అయిన మొహాలీ టెస్టులో అతడు శతకం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కోహ్లీ టెస్టుల్లో 27 శతకాలు చేశాడు. ఇక.. గత ఐదు టెస్టుల్లో కోహ్లీ 26 సగటుతో 208 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లో మూడు డకౌట్‌లు ఉండడం గమనార్హం. అయితే.. 2017లో లంకతో సిరీస్ సందర్భంగా మూడు టెస్టుల్లో 610 పరుగులు చేశాడు. మరోసారి అదే ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.