రాహుల్ రికార్డు శతకం.. భారీ స్కోర్ దిశగా భారత్
KL Rahul ton helps IND to end day at 272.దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయమే లక్ష్యంగా సెంచూరియన్ వేదికగా
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2021 5:42 AM GMTదక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయమే లక్ష్యంగా సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెలుతోంది. వైస్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్(248 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 122 బ్యాటింగ్) శతకంతో కదం తొక్కడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్‌తో పాటు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే (81 బంతుల్లో 8 ఫోర్లతో 40 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60) శుభారంభం అందించారు. ఈ ఇద్దరూ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశారు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఓ వైపు రాహుల్ నిదానంగా ఆడగా.. మయాంక్ మాత్రం తనదైన షాట్లతో అలరించారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని లుంగి ఎంగిడి విడదీశాడు. వరుస బంతుల్లో మయాంక్ అగర్వాల్‌తో పాటు పుజారా(0)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో రాహుల్‌కు జత కలిసిన కోహ్లీ(94 బంతుల్లో 4 ఫోర్లతో 35) మరో వికెట్ వికెట్ పడకుండా రెండో సెషన్‌ను ముగించారు. దాంతో భారత్ 157/2 స్కోర్ తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
మూడో సెషన్‌లో కూడా రాహుల్, కోహ్లీ నిలకడగా ఆడారు. సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని మరోసారి లుంగి ఎంగిడే విడదీసాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే తనదైన శైలిలో ఆడాడు. గత కొంతకాలంగా ఫామ్‌లో లేక జట్టులో చోటే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో బరిలోకి దిగిన రహానే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రాహుల్-రహానే జోడి మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అభేధ్యంగా 73 పరుగులు జోడించారు. తొలి రోజు ఆటలో భారత్ కోల్పోయిన మూడు వికెట్లు కూడా లుంగి ఎంగిడి తీయడం విశేషం. ఇక రెండో రోజు రహానేతో పాటు పంత్ రాణిస్తే సౌతాఫ్రికాకు కష్టాలు తప్పవు.
14 ఏళ్ల తరువాత..
తొలి రోజు ఆటలో రాహుల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై శతకం సాధించిన రెండో భారత ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. అది కూడా 14 ఏళ్ల తరువాత కావడం గమనార్హం. 2007 పర్యటలో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వసీమ్ జాఫర్ (116) శతకం బాదగా.. ఇన్నాళ్లకు రాహుల్ ఆ ఘనత సాధించాడు. 2018లో కూడా రాహుల్ (90 నాటౌట్) శతకానికి చేరువగా వచ్చినా.. 10 పరుగుల దూరంలో ఆగిపోయాడు. అంతకముందు మురళీ విజయ్(97), గౌతమ్ గంభీర్(93) సైతం ఇలాగే స్వల్ప తేడాతో శతకాలను అందుకోలేకపోయారు.