టీమ్ఇండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా.. దక్షిణాఫ్రికాకు చేరిన భారత జట్టు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. న్యూజిలాండ్‌తో సిరీస్ వరకు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే పేలవ ఫామ్ ఇబ్బందులు పడుతుండడంతో అతడిని తొలగించి ఆ స్థానంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు టెస్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు సెలక్టర్లు.
ఈ టెస్ట్ సిరీస్(దక్షిణాఫ్రికా) సిరీస్ నుంచి రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉండగా.. తొడకండరాల గాయంతో అతడు ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారా... అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మళ్లీ రహానే కే ఆ బాధ్యతలు అప్పగిస్తారా..? చర్చ కూడా మొదలైంది. అయితే.. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్లలోనూ రాహుల్ సత్తా చాటుతుండడంతో బీసీసీఐ అతడికి ఓటు వేసింది. రోహిత్ రాగానే.. అతడే టెస్ట్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆ సమయాని కల్లా రోహిత్ సౌతాఫ్రికా చేరుకునే అవకాశం ఉంది. వన్డేకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.