టెస్టు సిరీస్‌కు ముందు భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌

KL Rahul Ruled Out Of Test Series Suryakumar Yadav Added To Squad.కాన్పూర్ వేదిక‌గా రేప‌టి(గురువారం) నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2021 6:13 AM GMT
టెస్టు సిరీస్‌కు ముందు భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌

కాన్పూర్ వేదిక‌గా రేప‌టి(గురువారం) నుంచి భార‌త జ‌ట్టు న్యూజిలాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. కాగా.. తొలి టెస్టుకు ముందు భార‌త జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ తొడ కండ‌రాల గాయంతో ఈ సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇప్ప‌టికే తొలి టెస్టుకు విశ్రాంతి నేప‌థ్యంలో రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ దూరం కాగా.. ఇప్పుడు రాహుల్ కూడా త‌ప్పుకోవ‌డం నిజంగా ఇది భార‌త జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బే అని చెప్ప‌వ‌చ్చు.

దీంతో బ్యాటింగ్ భారం మొత్తం సీనియ‌ర్ ఆట‌గాళ్లు.. తొలి టెస్టుకు కెప్టెన్ వ్య‌వ‌హ‌రిస్తున్న అజింక్య ర‌హానే, వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ చెతేశ్వ‌ర్ ఫుజారాల‌పైనే ఉంది. ఇక గాయ‌ప‌డిన రాహుల్ స్థానంలో యువ ఆట‌గాడు సూర్య కుమార్ యాద‌వ్‌ను తీసుకున్న‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇక గాయం నుంచి కోలుకోవ‌డం కోసం రాహుల్ జాతీయ క్రికెట్ అకాడ‌మీ(ఎన్‌సీఏ)కి వెళ్తాడ‌ని.. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు స‌న్న‌ద్దం అవుతాడ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో బీసీసీఐ తెలిపింది.

ఇక టెస్టు సిరీస్‌కు రాహుల్ దూరం కావ‌డంతో మ‌యాంక్ అగ‌ర్వాల్‌కు తోడుగా శుభ్‌మ‌న్ గిల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఈ జోడి నెట్ సెష‌న్‌లో చ‌మ‌టోడ్చింది. ఇక మిడిల్ ఆర్డ‌ర్‌లో శ్రేయాస్ అయ్య‌ర్ లేదా సూర్య‌కుమార్ యాద‌వ్ ఇద్ద‌రిలో ఒక‌రు ఈ మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేయ‌డం ఖాయ‌మే. ఇక భార‌త జ‌ట్టు సీనియ‌ర్ స్పిన్న‌ర్ అశ్విన్ జూన్ త‌రువాత ఆడుతున్న తొలి టెస్టు ఇదే. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ ముగ్గురు స్పిన్న‌ర్ల‌ను ఆడించొచ్చు. అశ్విన్, జ‌డేజాల‌కు తోడుగా అక్ష‌ర్ ప‌టేల్ స్పిన్ బాధ్య‌త‌లు పంచుకునే అవ‌కాశం ఉంది.

Next Story