రాహుల్ కు జరిమానా.. ఒక డీమెరిట్ పాయింట్‌ కూడా..!

KL Rahul fined for showing dissent towards the umpires. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట‌లో టీమిండియా ఓపెన‌ర్

By Medi Samrat  Published on  5 Sep 2021 2:00 PM GMT
రాహుల్ కు జరిమానా.. ఒక డీమెరిట్ పాయింట్‌ కూడా..!

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట‌లో టీమిండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌కు మ్యాచ్‌ రిఫరి క్రిస్‌ బ్రాడ్‌ జ‌రిమానా విధించారు. రాహుల్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించారు. మూడో రోజు ఆట‌ తొలి సెషన్‌ 34వ ఓవర్‌లో ఆండర్సన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్యాచ్‌కు అపీల్‌ చేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ రివ్యూకి వెళ్లాడు. అందులో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై రాహుల్‌ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయడంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ఆర్టిక‌ల్ 2.8(అంపైర్ నిర్ణ‌యంపై అసంతృప్తి వ్యక్తం చేయడం) ఉల్లంఘన నేరం కింద జ‌రిమానా విధించారు. దీంతోపాటు రాహుల్‌ క్ర‌మశిక్ష‌ణ రికార్డ్‌లో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.

రోహిత్ రికార్డులు:

విదేశాల్లో టెస్టుల్లో తొలిసారి సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌ గడ్డపై ఒక రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్‌ గడ్డపై అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రోహిత్‌ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 9 సెంచరీలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఆసీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ 11 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ కూడా 9 సెంచరీలతో రోహిత్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అంతకముందు టీమిండియా మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 8 సెంచరీల రికార్డును రోహిత్‌ అధిగమించాడు.


Next Story