కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌కు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. కెప్టెన్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అతడి స్థానంలో నితీష్ రానాను కెప్టెన్ చేసింది. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో గాయపడ్డ అయ్యర్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడని, అయితే ఈ సీజన్‌లో అతను ఏదో ఒక దశలో పాల్గొంటాడని KKR బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. కోల్‌కతాకు చెందిన దిగ్గజాలు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లను కాదని.. KKR బృందం 29 ఏళ్ల భారత బ్యాటర్ నితీష్ రానాను కెప్టెన్ గా ఎంపిక చేసింది. రానా 2018 సీజన్ నుండి KKRలో భాగంగా ఉన్నాడు. 16వ సీజన్‌లో కేకేఆర్‌కు నితీష్ రానా సారథ్యం వహించనున్నాడు. KKRలో చేరడానికి ముందు.. రానా ముంబై ఇండియన్స్ (MI) కు ఆడాడు. 2017లో ముంబై టైటిల్ గెలవడంలో అతడు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు.
నితీశ్ రానా 2018 నుంచి కోల్‌కతాతో కొనసాగుతున్నాడు. గత ఐదు సీజన్లలో 300లకు పైగా పరుగులు సాధించి నిలకడగా రాణిస్తున్నాడు. దేశవాళీ టోర్నమెంట్లలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం రానాకు ఉంది. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అదరగొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 2021లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటనలో రెండు టీ20లు, ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఐపీఎల్ పదహారో సీజన్ మార్చి 31న మొదలు కానుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 1న తలపడనుంది.