మ‌హిళా క్రికెట‌ర్ సభ్యత్వాన్ని రద్దు చేశారు.. తండ్రి చేసిన ప‌నులే కార‌ణం..!

ముంబైలోని పురాతన క్రికెట్ క్లబ్‌లలో ఒకటైన ఖార్ జింఖానా స్టార్ భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది

By Medi Samrat  Published on  22 Oct 2024 8:15 PM IST
మ‌హిళా క్రికెట‌ర్ సభ్యత్వాన్ని రద్దు చేశారు.. తండ్రి చేసిన ప‌నులే కార‌ణం..!

ముంబైలోని పురాతన క్రికెట్ క్లబ్‌లలో ఒకటైన ఖార్ జింఖానా స్టార్ భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. జెమీమా తండ్రి ఇవాన్ క్లబ్ ప్రాంగణంలో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం, ప్రజలను మతం మార్చే ప్రయత్నం చేయడంపై కొందరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు క్లబ్ అధికారులు, కమిటీ సభ్యులు తెలిపారు. 2023లో ఖార్ జింఖానా క్లబ్ జెమిమా రోడ్రిగ్స్‌ను సభ్యురాలుగా, దాని సౌకర్యాలను ఉపయోగించుకోవాలని ఆహ్వానించింది. మూడేళ్ల సభ్యత్వాన్ని మంజూరు చేసింది. ఆమె తండ్రి నిర్వహించిన కార్యకలాపాల కారణంగా మత మార్పిడి కోణంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కమిటీ సభ్యుడు శివ్ మల్హోత్రా మాట్లాడుతూ.. మేము జెమీమాను చూసి గర్విస్తున్నాము. ఆమె దేశానికి ఎంతో ప్రతిష్టను తీసుకుని వచ్చింది. కానీ ఆమె తండ్రి క్లబ్‌లో దాదాపు 35 సమావేశాలను ఒక సంవత్సరం పాటు హాల్‌ ను బుక్ చేసి నిర్వహించారు. బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ అనే సంస్థతో సమావేశాలు నిర్వహించేవారు. హాల్ వ్యక్తిగతంగా జెమిమా పేరు మీద బుక్ చేశారు. జింఖానా నిబంధనలకు విరుద్ధంగా ఉండే సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా మాఫీ చేసారు. కొన్ని నెలల క్రితం ఒక MNS నాయకుడు కూడా ఈ పరిణామాలపై లేఖ రాశారని తెలిపారు.

అక్టోబరు 20, 2024న జరిగిన సాధారణ సమావేశానికి హాజరైన సభ్యులు ఆమోదించిన తీర్మానం ప్రకారం జెమిమా రోడ్రిగ్స్‌కు ఇచ్చిన గౌరవ మూడేళ్ల సభ్యత్వం రద్దు చేసినట్లు ఖార్ జింఖానా సభ్యులు ప్రకటన చేశారు. ఖార్ జింఖానా బైలాస్ ప్రకారం, రాజ్యాంగంలోని రూల్ 4A ప్రకారం మతపరమైన కార్యకలాపాలను నిషేధించారు. అక్టోబర్ 20, 2024న జరిగిన సాధారణ సమావేశంలో సభ్యులు జెమీమా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసినా సమాధానం రాలేదని క్లబ్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఆమె తండ్రి మెసేజ్‌లకు స్పందించలేదని తెలుస్తోంది.

Next Story