ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించారు. ఫిబ్రవరి 19 నుంచి జరిగే ఈ టోర్నీకి రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్ భారత జట్టులోకి తిరిగి వస్తాడని ఊహాగానాలు వినిపించాయి. అయితే అతడికి చోటు దక్కలేదు.
విజయ్ హజారీ ట్రోఫీ ఫైనల్ లో కరుణ్ నాయర్ విఫలమయ్యాడు. కర్ణాటక-విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కరుణ్ నాయర్ మరో సంచలన ఇన్నింగ్స్ ఆడుతాడని అందరూ భావించారు. కానీ కరుణ్ నాయర్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. 31 బంతుల్లో 27 పరుగులు చేసి కరుణ్ నాయర్ పెవిలియన్ బాట పట్టాడు. కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు.. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. విదర్భ జట్టు 16.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.