8 ఏళ్ల తర్వాత జట్టులోకి రానున్న ట్రిపుల్ సెంచరీ స్టార్‌..?

2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు.

By Medi Samrat  Published on  13 Jan 2025 4:35 PM IST
8 ఏళ్ల తర్వాత జట్టులోకి రానున్న ట్రిపుల్ సెంచరీ స్టార్‌..?

2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌పై అతడు ఆడిన ఈ ఇన్నింగ్స్ ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్.. ఎందుకంటే నాయర్ తన మొట్టమొదటి టెస్ట్ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకున్నాడు. అయితే దీని తర్వాత నాయర్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే.. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ పట్టు వదలకుండా మరోసారి సెలక్టర్ల దృష్టిలో ప‌డ్డాడు.

కరుణ్ నాయర్ 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. అప్పటి నుంచి నాయర్ జట్టులోకి పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. నాయర్ భారత్ తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతడు 374 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై అజేయంగా ఒక మ్యాచ్‌లో 303 పరుగులు చేశాడు.

ఇంగ్లీష్ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భకు ఆడుతున్న నాయర్ ప్రదర్శనపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ దృష్టి పెట్టవలసి వచ్చింది. దీంతో అతడు టెస్టు జట్టులోకి తిరిగి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టెస్టు జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల స్థానంపై సంక్షోభం నెలకొంది. అటువంటి పరిస్థితిలో జట్టులో స్థానం కోసం చూస్తున్న‌ నాయర్ ఎంపిక అన్ని విధాల క‌రెక్ట్ అనే వాద‌న విన‌ప‌డుతుంది. నాయర్‌కు దేశవాళీ క్రికెట్‌లో అనుభవం ఉంది. అతని అనుభవంతో సీనియర్ ఆటగాడి పాత్రను పోషించగలడనే వాద‌న విన‌వ‌స్తుంది.

నాయర్ కర్ణాటక జట్టుకు ఆడేవాడు. అయితే అతనికి దేశవాళీ క్రికెట్‌లో ఆడటానికి అవ‌కాశం లేని సమయం వచ్చింది. దీంతో అతడు మాజీ భారత ఫాస్ట్ బౌలర్ అభయ్ కులకర్ణి సహాయం కోరాడు. తరువాత అతడు విదర్భ జట్టులో నాయర్‌కు చోటు సంపాదించాడు.

నాయర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. "అండర్-19 టీమ్ సమయంలో ఆయ‌న‌ (కులకర్ణి) నా సెలెక్టర్. ఆయ‌న‌ వద్దకు వెళ్ళే స్వేచ్ఛ నాకు ఉంది. నేను ఆయ‌న‌తో మాట్లాడాను.. సార్ నేను కొత్త జట్టు కోసం చూస్తున్నానని చెప్పాను. కాబట్టి మీరు నాకు సహాయం చేయగలరా.? అని అడిగాను. అవ‌కాశం క‌ల్పించారని పేర్కొన్నాడు.

Next Story