ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు కరుణ్ నాయర్ దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. 33 ఏళ్ల కరుణ్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 టోర్నమెంట్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఉన్నాడు. ఏడు సంవత్సరాల నుండి జట్టుకు దూరంగా ఉన్న కరుణ్ నాయర్.. భారత జట్టు లోకి తిరిగి రావడానికి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. గురువారం నాడు సెమీ-ఫైనల్‌లో కరుణ్ కేవలం 44 బంతుల్లో 88 పరుగులు చేసి, విదర్భ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేయడానికి కారణం అయ్యాడు.
కరుణ్ నాయర్ ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు, 9 బౌండరీలతో విరుచుకుపడి విదర్భ స్కోరును 350 పరుగులు దాటించాడు. 48వ ఓవర్ ప్రారంభంలో 51 పరుగులతో క్రీజ్ లో నిలిచిన నాయర్.. చివరి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఏడు ఇన్నింగ్స్‌లలో 752 పరుగులు సాధించాడు.