క‌పిల్ ప్రేమ‌కు సాయం చేసిన అమూల్ యాడ్‌

Kapil Dev shares how he proposed to wife Romi after seeing Amul ad. ఎలాంటి అంచానాలు లేకుండా క‌పిల్ నేతృత్వంలోని భార‌త్

By Medi Samrat  Published on  20 Nov 2020 1:49 PM GMT
క‌పిల్ ప్రేమ‌కు సాయం చేసిన అమూల్ యాడ్‌

ఎలాంటి అంచానాలు లేకుండా క‌పిల్ నేతృత్వంలోని భార‌త్ జ‌ట్టు 1983 ప్రపంచ‌క‌ప్‌ను సాధించింది. అల‌నాటి బీక‌రమైన వెస్టీండిస్ పై సాధించిన ఆ విజ‌యం భార‌త క్రికెట్ రూపురేఖ‌ల‌నే మార్చేసింది. భార‌త్‌లో క్రికెట్ అంటే ఓ ఆట‌లా కాకుండా ఓ మతంలా మార‌డానికి ఆ విజ‌య‌మే కార‌ణం. కెప్టెన్‌గా, ఆల్‌రౌండ‌ర్‌గా క‌పిల్ ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

బౌలింగ్‌లో ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌డ పుట్టించే క‌పిల్.. త‌న ప్రేమ విష‌యం ప్రేయ‌సికి ఎలా చెప్పాలో తెలియ‌క త‌డ‌బ‌డ్డాడ‌ట‌. బాలీవుడ్ న‌టి నేహా దూపియాతో ఇటీవ‌ల ఓ రేడియో కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌పిల్.. నాటి సంగ‌తుల‌ను గుర్తుచేసుకున్నారు. త‌న‌ ప్రేమను ప్రేయసి రోమీ భాటియాకి చెప్పేందుకు అమూల్‌ యాడ్‌ను సహాయంగా తీసుకున్నానని వెల్లడించారు. ఓ రోజు కారులో రోమీ భాటియా, నేను కారులో వస్తున్నాం. దారిలో నా ఫొటో ఉన్న ఓ అమూల్‌ యాడ్‌ హోర్డింగ్‌ కనిపించింది. దానిని రోమీకి చూపించి.. ఫొటో తీయమన్నా‌. ఇప్పుడు ఫొటో ఎందుకని రోమీ నన్ను ప్రశ్నించింది. భవిష్యత్తులో మన పిల్లలకు చూపేందుకని జవాబిచ్చా. విషయం అర్ధంచేసుకున్న రోమీ.. ప్రపోజ్‌ చేస్తున్నావా అంది. అవును అని అన్నాను. రోమీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మొత్తానికి అమూల్‌ యాడ్‌ను‌ నా ప్రేమ కోసం అలా వాడుకున్నా' అని కపిల్ ‌దేవ్‌ తెలిపారు.

రోమీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా, ఆమె తండ్రి ఒప్పుకున్నా.. ఆమె తాతగారు మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వ‌ర్షం కురించాడ‌ట‌. ఆయ‌న‌ను ఒప్పించేందుకు క‌పిల్ నానా తంటాలు ప‌డ్డాడ‌ని చెప్పాడు. ప్రపంచకప్‌ గెలిచేందుకు మూడేళ్ల ముందు (1980)లో రోమీ భాటియా, కపిల్ ‌దేవ్‌ ఓ ఇంటివారయ్యారు. ఇదిలా ఉంటే.. 83 పేరుతో కపిల్‌ దేవ్ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణెలు కపిల్‌, రోమీలుగా నటిస్తున్నారు. ఈ సన్నివేశం 83 సినిమాలో ఉందట.
Next Story
Share it