కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!
కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి ఇంగ్లాండ్ జట్టుపై తన కెరీర్‌లో 33వ సెంచరీని నమోదు చేశాడు.
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 1:00 PM ISTకేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి ఇంగ్లాండ్ జట్టుపై తన కెరీర్‌లో 33వ సెంచరీని నమోదు చేశాడు. విలియమ్సన్ కేవలం 137 బంతుల్లో ఒక సిక్స్‌తో ఈ ప్రత్యేక ఫీట్ సాధించాడు. హామిల్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ 156 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అంతకుముందు ఆతిథ్య కివీస్ జట్టు 347 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది.
నిజానికి 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే మైదానంలో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ మైదానంలో ఆడిన చివరి ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో విలియమ్సన్ 200 (బంగ్లాదేశ్, 2019), తొలి ఇన్నింగ్సులో 4 , రెండో ఇన్నింగ్సులో 104 (ఇంగ్లండ్, 2019), 251 (వెస్టిండీస్, 2020), తొలి ఇన్నింగ్సులో 43, రెండో ఇన్నింగ్సులో 133* (దక్షిణాఫ్రికా 2024) పరుగులు చేశాడు.
టెస్టు క్రికెట్‌లో ఒకే మైదానంలో వరుసగా అత్యధిక సెంచరీలు సాధించిన విషయానికొస్తే.. కేన్ విలియమ్సన్ చాలా మంది దిగ్గజాలను అధిగమించాడు. హామిల్టన్‌లోని సిడాన్ పార్క్‌లో కేన్ విలియమ్సన్ వరుసగా 5 సెంచరీలు సాధించాడు. విలియమ్సన్ సెంచరీతో.. ఒకే మైదానంలో వరుసగా 4 సెంచరీలు చేసిన మహేల జయవర్ధన్, డాన్ బ్రాడ్‌మన్, మైఖేల్ క్లార్క్, డెన్నిస్, మార్టిన్ క్రోలతో సహా పలువురు దిగ్గజాలను వెనక్కి నెట్టాడు. విలియమ్సన్ అత్యంత వేగంగా 33 టెస్ట్ సెంచరీలు చేసిన మూడవ ఆటగాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ (178), రికీ పాంటింగ్ (183) ఉన్నారు.
WTC చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు
జో రూట్-18
కేన్ విలియమ్సన్- 11
మార్నస్ లాబుస్చాగ్నే- 11
స్టీవ్ స్మిత్-10
రోహిత్ శర్మ- 9
WTC చరిత్రలో ఇప్పటివరకు 18 సెంచరీలు సాధించిన జో రూట్ అత్యధిక సెంచరీలు సాధించిన పరంగా అగ్రస్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ రెండవ స్థానంలో ఉన్నాడు, అతను ఇంకా 7 సెంచరీల వెనుక ఉన్నాడు. కేన్ విలియమ్సన్ కాకుండా.. మార్నస్ పేరు మీద 11 సెంచరీలు ఉన్నాయి,.. కానీ విలియమ్సన్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వలన మూడవ స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాడు రోహిత్ శర్మ మాత్రమే ఆ జాబితాలో టాప్-5లో ఉన్నాడు.