సిరీస్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్..!

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ జట్టు తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

By Kalasani Durgapraveen  Published on  29 Oct 2024 10:11 AM IST
సిరీస్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్..!

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ జట్టు తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. బెంగళూరు, పుణెలో జరిగిన మ్యాచ్‌ల్లో కివీస్‌ జట్టు భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. సిరీస్‌లో మూడో, చివరి టెస్టు ముంబై వేదికగా ప్రారంభం కానుండ‌గా.. అంతకుముందే న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టు మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో లేడు.

గాయం కారణంగా విలియమ్సన్ మొదటి, రెండో టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని.. మూడో మ్యాచ్‌లో ఆడతాడని జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఈ ఆశ అడియాశలైంది. విలియమ్సన్‌కు ఇంకా గజ్జల్లో సమస్య ఉంది.

ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కేన్ విలియమ్సన్ పూర్తిగా ఫిట్‌గా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ముంబై టెస్టులో కేన్ విలియమ్సన్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీమ్ మేనేజ్‌మెంట్ అతడి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. విలియమ్సన్ మంచి పురోగతి సాధించాడని.. అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు సంబంధించి అతనికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీమ్ కోచ్ స్టెడ్ తెలిపాడు.

న్యూజిలాండ్ ఏమైనప్పటికీ సిరీస్‌ను గెలుచుకుంది. ఈ కారణంగా విలియమ్సన్ ఆడినా, ఆడ‌క‌పోయినా పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "కేన్ బాగా కోలుకున్నాడు, కానీ అతడు మాతో చేరడానికి సిద్ధంగా లేడు.. పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ.. అతడు న్యూజిలాండ్‌లో పునరావాసం చివరి భాగంపై దృష్టి పెట్టడం ఉత్తమమని మేము భావిస్తున్నాము. త‌ద్వారా అతడు ఇంగ్లాండ్‌కు ప‌ర్య‌ట‌న‌కు సిద్ధంగా ఉండగలడు అని అన్నాడు.

ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌కి ఇంకా నెల రోజుల సమయం ఉంది. అటువంటి పరిస్థితిలో విలియమ్సన్ పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి సమయం లభిస్తుంది. ఇంగ్లండ్ సిరీస్‌కు ఇంకా ఒక నెల సమయం ఉంది, కాబట్టి అతను తెలివిగా వ్యవహరిస్తే, అతను ఇంగ్లాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉంటాడని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.


Next Story