ఆ బంతిని కూడా వ‌ద‌ల‌వా బ‌ట్ల‌ర్‌.. వీడియో వైర‌ల్‌

Jos Buttler smashes huge six off double bounce delivery in 3rd ODI.ఇంగ్లాండ్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ త‌న కెరీర్‌లోనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2022 10:01 AM GMT
ఆ బంతిని కూడా వ‌ద‌ల‌వా బ‌ట్ల‌ర్‌.. వీడియో వైర‌ల్‌

ఇంగ్లాండ్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌)లో రాజ‌స్థాన్ త‌రుపున బ‌రిలోకి దిగి చెల‌రేగిన బ‌ట్ల‌ర్‌.. ప‌సికూన నెట‌ర్లాండ్స్‌ను ఓ ఆట ఆడుకుంటున్నాడు. తొలి వ‌న్డేలో 162 ప‌రుగుల‌తో నాటౌట్ నిలిచి ఇంగ్లాండ్ రికార్డు స్కోర్ 498/4 సాధించ‌డంతో కీలక పాత్ర పోషించాడు. తాజాగా మూడో వ‌న్డేలో సైతం మ‌రోసారి చెల‌రేగాడు. 64 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 86 పరుగులు సాధించి.. నెద‌ర్లాండ్స్‌పై ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్(3-0) సాధించేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్ ఆడిన ఓ బంతి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆమ్‌స్ట‌ల్‌వీన్ వేదిక‌గా బుధ‌వారం జ‌రిగిన మూడో వ‌న్డేలో నెద‌ర్లాండ్స్ నిర్దేశించిన 245 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 30.1 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(86 బంతుల్లో 101 నాటౌట్‌, 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. బట్లర్‌ 86 నాటౌట్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్ర‌మంలో బ‌ట్ల‌ర్ ఓ విచిత్ర‌మైన బంతిని సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఇన్నింగ్స్ 29వ ఓవర్‌ నెదర్లాండ్స్‌ బౌలర్‌ పాల్‌ వాన్‌ మీక్రిన్‌ వేశాడు. ఓవర్‌ ఐదో బంతిని పాల్‌ వాన్‌ షార్ట్‌ పిచ్‌ వేసే ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి స్లో అయ్యి క్రీజు పక్కకు పోయింది. బంతిని వదిలేద్దామన్న దయ, జాలీ ఏ కోశానా బట్లర్‌లో కనబడలేదు. వెంట‌నే ఆ బంతి వద్ద‌కెళ్లి దాన్ని అమాంతం సిక్సర్ బాదేశాడు. కాక‌పోతే అది నోబాల్‌గా ప్ర‌క‌టించ‌డంతో మ‌రుస‌టి బంతిని కూడా బ‌ట్ల‌ర్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ప్ర‌స్తుతం ఈ బంతికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుత‌న్నారు.


Next Story
Share it