సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ జోస్ బట్లర్..!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన నిరాశ పరిచింది. ఆ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

By Medi Samrat  Published on  28 Feb 2025 7:54 PM IST
సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ జోస్ బట్లర్..!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన నిరాశ పరిచింది. ఆ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ ఇప్పటికే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఆ షాక్ నుంచి జ‌ట్టు కోలుకోక‌ముందే ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్ జోస్ బట్లర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దీంతో బట్లర్ కెప్టెన్‌గా తన చివరి మ్యాచ్‌ని మార్చి 1న దక్షిణాఫ్రికాతో ఆడనున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఫిబ్రవరి 22న లాహోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఇంగ్లండ్‌పై ఆఫ్ఘన్‌ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2 వరుస పరాజయాల తర్వాత, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి నిష్క్రమించింది. ఇంగ్లండ్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 1న కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో బట్లర్ కెప్టెన్సీ నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా ఇందులో గెలిచి 5 పాయింట్లకు చేరుకోవాలి.

జోస్ బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 44 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవ‌లం 18 వ‌న్డేల‌లో మాత్ర‌మే గెలిచింది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 25 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అలాగే ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది.

Next Story