ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి కారణంగా భారత జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి ఫ్రాక్చర్ అయింది. ఈ కారణంగా రాబోయే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ లో సంజూ ఆడడం కష్టమే. ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు సంజూ శాంసన్ ఆటకు దూరంగా ఉండాల్సింది. సంజు ప్రస్తుతం తన స్వస్థలమైన తిరువనంతపురంకు చేరుకున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ లో పునరావాసం పూర్తి చేసిన తర్వాత మాత్రమే శిక్షణను ప్రారంభిస్తాడని బీసీసీఐ తెలిసింది. సంజూ తిరిగి మ్యాచ్ లు ఆడాలంటే అతనికి NCA గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
"సంజూ శాంసన్ కుడి చూపుడు వేలు విరిగింది. అతను నెట్స్ లో ప్రాక్టీస్ పునఃప్రారంభించడానికి ఐదు నుండి ఆరు వారాల సమయం పడుతుంది. కాబట్టి సంజూ ఫిబ్రవరి 8-12 వరకు పూణేలో కేరళ తరపున జమ్మూ కశ్మీర్ పై రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో ఆడే అవకాశం లేదు, ”అని సంబంధిత వర్గాలు తెలిపినట్లు PTI నివేదించింది. IPL సమయానికి సంజూ కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంగ్లండ్‌పై పేలవమైన ప్రదర్శన చేశాడు సంజూ. ఇక ఇంగ్లండ్ తో వన్డే టీమ్ లో సంజూ శాంసన్ భాగం కాదు. ముంబైలో జరిగిన టీ20 మ్యాచ్ లో ఆర్చర్ వేసిన బంతి 150 కిలోమీటర్ల వేగంతో సంజూ వేలుని తాకింది. అవుట్ అయ్యాక డగ్-అవుట్ కు తిరిగి వచ్చిన సంజూ వేలులో వాపు పెరిగింది. స్కాన్‌లో ఫ్రాక్చర్ కనిపించింది.