'మ్యాచ్ ఓడిపోవడం మంచిదే'.. RCB కెప్టెన్ ఎందుకు ఇలా అంటున్నాడు..?

ఐపీఎల్‌-2025లో భాగంగా శుక్రవారం (మే 23) లక్నోలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరిగింది

By Medi Samrat
Published on : 24 May 2025 9:29 AM IST

మ్యాచ్ ఓడిపోవడం మంచిదే.. RCB కెప్టెన్ ఎందుకు ఇలా అంటున్నాడు..?

ఐపీఎల్‌-2025లో భాగంగా శుక్రవారం (మే 23) లక్నోలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు ఇషాన్ కిషన్ 94 పరుగుల సాయంతో 231/6 స్కోరు చేసింది. దీనికి సమాధానంగా RCB జట్టు 189 పరుగులు మాత్ర‌మే చేసి ఆలౌటైంది. తద్వారా 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో టాప్-2కు చేరుకోవాలన్న ఆర్సీబీ ఆశలకు గండిపడింది.

ఈ మ్యాచ్‌లో RCB రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ తీసుకున్నాడు. జట్టు రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ పూర్తిగా ఫిట్‌గా లేడు. అతడు బ్యాటింగ్ మాత్రమే చేశాడు. ఫీల్డింగ్ చేయలేదు. కాబట్టి అతన్ని ఇంపాక్ట్ ప్లేయ‌ర్ల‌ జాబితాలో ఉంచారు. అయితే మ్యాచ్ అనంతరం జితేష్ శర్మ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. తమ జట్టు దాదాపు 20-30 పరుగులు ఎక్కువగా ఇచ్చిందని, ఆరంభంలో ఆశించిన వేగం కనబరచలేదని అతను అంగీకరించాడు.

జితేష్ మాట్లాడుతూ.. "మేము 20-30 పరుగులు ఎక్కువ ఇచ్చామని నేను అనుకుంటున్నాను, వారు అద్భుతంగా బ్యాటింగ్ చేసారు.. వారి దూకుడుకి నా దగ్గర సమాధానం లేదు.. మేము కొంచెం వెన‌క‌ప‌డ్డాం.. ప్రారంభంలో మా జోరు కనిపించలేదు.. అయినా జితేష్ జట్టు బౌలింగ్‌ను ప్రశంసించాడు. డెత్ ఓవర్లలో జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన సంభాషణలో జితేష్ మాట్లాడిన విషయం చాలా చర్చనీయాంశమైంది. ఈ ఓటమిని జితేష్ ముఖ్యమైన పాఠంగా తీసుకున్నాడు. కొన్నిసార్లు మ్యాచ్ ఓడిపోవడం కూడా మంచి సంకేతం.. ఎందుకంటే మ‌నం మ‌న‌ లోపాలను విశ్లేషించుకోవచ్చు, మంచి విషయం ఏమిటంటే ఆటగాళ్లందరూ సహకరిస్తున్నారు.. ఈ ఓటమి తర్వాత మేము విషయాలను మళ్లీ సమీక్షించుకునే అవకాశం వచ్చింది, మేము ఓట‌మి నుండి ముందుకు వెళ్తామని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో ఒక సమయంలో RCBకి 36 బంతుల్లో 69 పరుగులు అవసరం. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. కానీ SRH తర్వాతి 35 బంతుల్లో 26 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నితీష్‌రెడ్డి, ఇషాన్‌ మలింగ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ మలుపు తిరిగింది.

ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ గాయంతో బాధపడ్డాడు. దీనిపై జితేష్‌ను ప్రశ్నించగా.. అతడి ఇన్నింగ్స్‌తో తాను నిరాశకు గురయ్యానని.. డేవిడ్‌ని ఇంకా కలవలేదు.. ఎందుకంటే నా అవుట్‌తో నేను నిరాశ చెందాను అని పేర్కొన్నారు.

Next Story