భారత దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కశ్మీర్ చరిత్ర లిఖించింది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. హుబ్లీ వేదికగా ముగిసిన ఫైనల్లో 8 సార్లు ఛాంపియన్ అయిన కర్ణాటకతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 291 పరుగుల భారీ ఆధిక్యం కారణంగా జమ్మూ కశ్మీర్ విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూ కశ్మీర్ భారీ స్కోరు సాధించింది. శుభమ్ పుండిర్ (117) రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి కశ్మీర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అతనికి యావర్ హసన్ (88), కనిష్క వధావన్ (70), సాహిల్ లోత్రా (72) సహకారం అందించడంతో 584 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకను జమ్మూ కశ్మీర్ బౌలర్లు అడ్డుకున్నారు. అకిబ్ నబీ దార్ (5/54) తో కర్ణాటక పతనాన్ని శాసించాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (160) ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో కర్ణాటక 293 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ జమ్మూ కశ్మీర్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (160 నాటౌట్), సాహిల్ లోత్రా (101 నాటౌట్) అజేయ సెంచరీలు చేశారు. జమ్మూ కశ్మీర్ 342/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో నిబంధనల ప్రకారం మ్యాచ్ డ్రాగా ముగిసింది.