కోహ్లీ రికార్డ్‌కు ప‌రుగుదూరంలో యశస్వి జైస్వాల్..!

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. మార్చి 7నుంచి ధర్మశాలలో ఇరు జట్లు తలపడనున్నాయి.

By Medi Samrat  Published on  6 March 2024 7:34 PM IST
కోహ్లీ రికార్డ్‌కు ప‌రుగుదూరంలో యశస్వి జైస్వాల్..!

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. మార్చి 7నుంచి ధర్మశాలలో ఇరు జట్లు తలపడనున్నాయి. చివరి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టి సునీల్ గవాస్కర్ స‌రస‌న‌ చేరాలని చూస్తున్నాడు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌లో తన బ్యాట్‌తో ప్రకంపనలు సృష్టించాడు. జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇప్పటివరకూ నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో 93.57 సగటుతో 655 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లీని అధిగమించేందుకు జైస్వాల్‌కి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఐదో టెస్టులో ఒక పరుగు చేయడం ద్వారా యశస్వి జైస్వాల్ ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ రికార్డును అధిగమించనున్నాడు.

2016-17లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ 655 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో కోహ్లి రెండు డబుల్ సెంచరీలు కూడా చేశాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న మరో రికార్డును యశస్వి బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ యశస్వి రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 38 పరుగులు చేస్తే.. విరాట్ ఆల్ టైమ్ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేయ‌గ‌ల‌డు. 2014-15లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 692 పరుగులు చేశాడు.

అంతేకాడు సునీల్ గవాస్కర్ స‌ర‌ప‌న కూడా జైస్వాల్ చేరే అవకాశం ఉంది. సునీల్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. గ‌వాస్క‌ర్‌ రెండుసార్లు 700 మార్క్ దాటిన ఏకైక బ్యాట్స్‌మెన్. గవాస్కర్ 1970-71లో వెస్టిండీస్‌పై తొలిసారి 774 పరుగులు, 1978-79లో రెండోసారి 732 పరుగులు చేశాడు. జైస్వాల్ రాణించి 700 ప‌రుగులు చేస్తే ఆ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ ఈ రెండు ఘనతలను సాధించే అవకాశం ఉంది. జైస్వాల్ బ్యాట్ పరుగులు చిమ్ముతున్న తీరు చూస్తుంటే ఇదేం అసాధ్యమేమీ కాదనిపిస్తోంది.

Next Story