జ‌డేజా మాయాజాలం.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 174 ఆలౌట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 32/2

Jadeja takes five as India enforce follow-on against Sri Lanka.బ్యాటింగ్‌లో భారీ శ‌త‌కం(175 నాటౌట్‌)తో టీమ్ఇండియాకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2022 12:39 PM IST
జ‌డేజా మాయాజాలం.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 174 ఆలౌట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 32/2

బ్యాటింగ్‌లో భారీ శ‌త‌కం(175 నాటౌట్‌)తో టీమ్ఇండియాకు భారీ స్కోర్ అందించిన ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లోనూ (5/41) విజృంభించాడు. ఫ‌లితంగా మొహాలీ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 174 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. జ‌డేజా 5 వికెట్లు తీయ‌గా.. రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. షమీకి ఓ వికెట్ దక్కింది. లంక బ్యాట్స్‌మెన్ల‌లో నిశాంక‌(61 నాటౌట్; 133 బంతుల్లో 11 పోర్లు) ఒక్క‌డే రాణించ‌గా.. మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. దీంతో భార‌త్‌కు 400 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 574/8 వ‌ద్ద డిక్లేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆదివారం 108/4 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట‌ను కొన‌సాగించిన లంక మ‌రో 66 ప‌రుగులు జోడించి మిగ‌తా వికెట్ల‌ను కోల్పోయింది. ఓవ‌ర్ నైట్ బ్యాట్స్‌మెన్లు అస‌లంక‌, నిశాంక ఆట ప్రారంభ‌మైన తొలి గంట ఆచితూచి ఆడారు. ఈ జోడిని బుమ్రా విడ‌గొట్టాడు. దీంతో 161 ప‌రుగుల వ‌ద్ద శ్రీలంక ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఈ ద‌శ‌లో భార‌త బౌల‌ర్లు విజృంచ‌డంతో 13 ప‌రుగుల తేడాతో మిగిలిన ఐదు వికెట్ల‌ను లంక కోల్పోయింది. చివరి నలుగురు బ్యాట్స్‌మన్ అయితే డకౌటవ్వడం గ‌మ‌నార్హం.

ఫాలో ఆన్ ఆడుతున్న లంక‌

భార‌త్‌కు 400 ప‌రుగుల భారీ ఆధిక్యాన్ని ఇచ్చిన లంక‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతోంది. ఈ సారి ర‌విచంద్ర‌న్ అశ్విన్ లంక‌ను గట్టి దెబ్బ కొట్టాడు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్ల‌ను తీశాడు. ప్ర‌స్తుతం లంక రెండో ఇన్నింగ్స్‌లో 32/2తో కొన‌సాగుతోంది. క్రీజులో క‌రుణ‌ర‌త్నే 19, అజెంలో మాథ్యూస్ 6 ప‌రుగుతో ఉన్నారు. ఇంకా శ్రీలంక భార‌త్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ క‌న్నా 367 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. మ‌రో 8 వికెట్లు తీస్తే భార‌త్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌నుంది.

Next Story