షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం.. తొలిరోజు మూడు పతకాలు

లిమాలో జరుగుతున్న ISSF ప్రపంచకప్‌లో భారత్‌ బలమైన శుభారంభం చేసి తొలిరోజు మూడు పతకాలు సాధించింది.

By Medi Samrat
Published on : 16 April 2025 3:29 PM IST

షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం.. తొలిరోజు మూడు పతకాలు

లిమాలో జరుగుతున్న ISSF ప్రపంచకప్‌లో భారత్‌ బలమైన శుభారంభం చేసి తొలిరోజు మూడు పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సురుచి సింగ్, మను భాకర్ వరుసగా బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు.

18 ఏళ్ల సురుచి సింగ్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో సురుచి స్కోరు 243.6. సురుచి మను భాకర్ కంటే 1.3 పాయింట్లు ఆధిక్యంలో ఉంది. భాకర్ 242.3 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. చైనాకు చెందిన యావో జియాన్సన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఇటీవల జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించిన సురుచి సింగ్ 582 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. భాకర్ 578 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.

స్వర్ణం గెలిచిన అనంతరం సురుచి సింగ్ మాట్లాడుతూ.. 'నేను ఒత్తిడికి గురికాలేదు. నా పోటీ నాతోనే కాబట్టి నాకు ఎవరు పోటీ వ‌స్తారనే ఆందోళన కూడా లేదు. నేను నా ఉత్తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను. అదే సమయంలో.. భాకర్ తన ఆట‌తీరుపై సంతృప్తిని వ్యక్తం చేసింది. సురుచి సింగ్ సాధించిన విజయాన్ని ప్రశంసించింది.

భాకర్ మాట్లాడుతూ.. 'భారత యువ షూటర్లు అంతర్జాతీయ స్థాయిలో పురోగతి సాధించడం.. మెరుగ్గా రాణించడం చాలా గొప్ప విషయం. సురుచి సింగ్ బ్యూనస్ ఎయిర్స్, లిమా రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేసింది. ఇది చాలా కాలం పాటు కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సమయంలో నేను యువతతో ముందుకు సాగాలని ఆశిస్తున్నానని పేర్కొంది.

సౌరభ్ చౌదరి రెండేళ్లలో తొలిసారి వ్యక్తిగత ISSF పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అతను 219.1 స్కోర్ చేశాడు. సౌరభ్ స‌హ‌చ‌రుడు వరుణ్ తోమర్ 198.1 స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన హు కై 246.4 స్కోరుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, బ్రెజిల్‌కు చెందిన ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మెయిడా వు 241 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

Next Story