'నెలకు రూ.4 లక్షలు తక్కువా?'.. షమీ భార్యను ప్రశ్నించిన‌ సుప్రీం

మహ్మద్ షమీ కష్టాలు తీరడం లేదు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసినా భారత జట్టులో చోటు దక్కించుకోలేక‌పోయాడు.

By -  Medi Samrat
Published on : 7 Nov 2025 9:10 PM IST

నెలకు రూ.4 లక్షలు తక్కువా?.. షమీ భార్యను ప్రశ్నించిన‌ సుప్రీం

మహ్మద్ షమీ కష్టాలు తీరడం లేదు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసినా భారత జట్టులో చోటు దక్కించుకోలేక‌పోయాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు ఇటీవల ప్రకటించిన భారత టెస్టు జట్టులో షమీని మళ్లీ పట్టించుకోలేదు. అదే సమయంలో విడాకులు తీసుకున్న భార్య భరణం విషయంలో మళ్లీ కోర్టును ఆశ్రయించింది. తనకు నెలకు రూ. 1.5 లక్షలు, తన కుమార్తెకు నెలకు రూ. 2.5 లక్షలుగా మెయింటెనెన్స్ అలవెన్స్‌గా నిర్ణయించిన కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను హాసిన్ జహాన్ సవాలు చేశారు. షమీ సంపాదన, జీవనశైలి దృష్ట్యా ఈ మొత్తం తక్కువేనని, భరణం పెంచాలని సుప్రీంకోర్టును కోరుతూ తన పిటిషన్‌లో వాదించింది.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం 'నెలకు రూ.4 లక్షలు.. ఇప్పటికే చాలా డబ్బు కాదా?' అని ప్ర‌శ్నించింది. అయితే నాలుగు వారాల్లోగా షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా స్పందించాలని ధర్మాసనం కోరింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్‌లో జరగనుంది. భారత క్రికెటర్ షమీ ఆదాయం, ఆస్తులు ప్రస్తుత భరణం ఆర్డర్‌లో చూపిన మొత్తం కంటే చాలా ఎక్కువ అని హసీన్ జహాన్ తరపు న్యాయవాది వాదించారు. కుటుంబ న్యాయస్థానం, కలకత్తా హైకోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, షమీ చాలా నెలలుగా చెల్లింపు చేయలేదని కూడా పిటిషన్ ఆరోపించింది.

తన భర్త ఆదాయంపై వ్యక్తిగత హక్కులను క్లెయిమ్ చేయనప్పటికీ, తన కుమార్తె తన తండ్రితో సమానమైన జీవన ప్రమాణాలకు అర్హురాలని హసిన్ జహాన్ అన్నారు. సుప్రీంకోర్టు నోటీసు తర్వాత షమీ, బెంగాల్ ప్రభుత్వం తమ సమాధానాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దీని తర్వాత డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

Next Story