నేటి నుంచే టీ20 సిరీస్.. ఒత్తిడిలో విండీస్.. అశ్విన్‌కు చోటు దక్కేనా..?
Is there place for Ashwin in IND vs WI 1st T20 match.వెస్టిండీస్‌ను దాని సొంత గడ్డపైనే వన్డే సిరీస్‌లో వైట్‌వాష్
By తోట వంశీ కుమార్ Published on 29 July 2022 9:26 AM GMTవెస్టిండీస్‌ను దాని సొంత గడ్డపైనే వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ చేసిన ఆనందంలో ఉన్న భారత్ టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. బ్రియాన్ లారా స్టేడియం వేదికగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు వెస్టిండీస్, భారత్‌లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. టీ20ల్లో విండీస్ జట్టును అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కాబట్టి సిరీస్ హోరాహోరీగానే సాగే అవకాశం ఉంది.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రావడం టీమ్ఇండియా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేదే. వన్డే సిరీస్ తుది జట్టులో ఆడిన వాళ్లలో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, ఆవేష్ ఖాన్ , అక్షర్ పటేల్ మాత్రమే టీ20 సిరీస్‌లో కొనసాగనున్నారు. గాయం కారణంగా ఐపీఎల్ తరువాత జట్టుకు దూరం అయిన కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు ఎంపికైనా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడి స్థానంలో సంజు శాంసన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సంజు కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పంత్ తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశాడు. రాహుల్ దూరమైన నేపథ్యంలో మరోసారి ఈ జంట బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్, ఆతరువాత శ్రేయస్, హార్థిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ రావొచ్చు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండడంతో తొలి టీ20లో బరిలోకి దిగకపోవచ్చు. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో అశ్విన్ ఉంటే నేటీ తుది జట్టులో ఉంటాడు.
హార్థిక్ తో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయించాలని బావిస్తే మరో ఎక్స్ ట్రా బ్యాట్స్‌మెన్‌ను తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు దీపక్ హుడా తుది జట్టులో ఉండొచ్చు. లేదంటే కుల్దీప్ యాదవ్ రెండో స్పిన్నర్‌గా అవకాశం దక్కనుంది. భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లకు తోడుగా అవేష్ ఖాన్ లేదా అర్షదీప్‌లలో ఒకరిని చోటు దక్కొచ్చు.
టీ20ల్లో విండీస్ ఎంత ప్రమాదకర జట్టో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగుల్లో అదరగొట్టిన చాలా మంది విధ్వంసకర బ్యాట్స్‌మెన్లు ఆ జట్టు సొంతం. కెప్టెన్ పూరన్‌తో పాటు ఆల్‌రౌండర్ హోల్డర్, రోమన్ పావెల్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను ఫలితాన్ని మార్చేయగల సమర్థులు. ఓపెనర్ కింగ్, ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్, స్పిన్నర్ అకీల్ హోసీన్‌లపై భారత్ ఓ కన్నువేయాల్సిందే. ఎనిమిది, తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం విండీస్ జట్టు సొంతం కనుక భారత బౌలర్లు వారిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి.