ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్-2021లో భాగంగా కరోనా కారణంగా జరగాల్సిన మిగిలిన మ్యాచ్ లకు సంబంధించిన డేట్స్ ను బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ 14వ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు దుబాయ్ లో నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించగా.. అందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసింది. భారత్ లో ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి 29 మ్యాచ్ లు జరిగాయి. మిగిలిన 31 మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తారు. సెప్టెంబరు 19న ఐపీఎల్ మ్యాచ్ లు మొదలవ్వనున్నాయి.. అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇతర దేశాల క్రికెట్ షెడ్యూల్ కారణంగా కొందరు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ సెకండాఫ్‌కు అందుబాటులో లేకపోతే కాస్త ఆదరణ తగ్గే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఫ్రాంచైజీలు ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో నిర్వహించబోయే మ్యాచ్‌లకు రాని విదేశీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోత విధించేందుకు సిద్దమైనట్లు బీసీసీఐకి చెందిన ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. కేవలం ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే ఫ్రాంచైజీలు జీతాలు చెల్లిస్తామని, ఆడని మ్యాచ్‌లకు జీతాలు చెల్లించబోరని వెల్లడించారు. బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్ల జీతాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండడంతో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడడం అనుమానంగానే ఉంది. చాలా దేశాలు తమ ఆటగాళ్లను విడుదల చేయడానికి విముఖత చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే పెద్ద ఎత్తున ఆదాయాన్ని క్రికెటర్లు కోల్పోయే అవకాశం ఉండడంతో ప్రత్యేక అనుమతులు తెచ్చుకునే అవకాశాలు లేకపోలేదు.


సామ్రాట్

Next Story