ఐపీఎల్-2024 సీజన్‌లో మరో అద్భుత రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్ గొప్పగా సాగుతోంది. ఈ సీజన్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 3:04 AM GMTఐపీఎల్-2024 సీజన్‌లో మరో అద్భుత రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్ గొప్పగా సాగుతోంది. ఈ సీజన్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే పరుగుల వరద పారుతోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్ రికార్డు అయ్యింది. అది కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ దాన్ని బ్రేక్ చేయడంతో తెలుగు అభిమానులందరూ సంతోషంగా ఉన్నారు. ఇక మే 8న జరిగిన హైదరాబాద్, లక్నో మ్యాచ్‌లో మరో అద్భుత రికార్డు నమోదు అయ్యింది. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్‌లో అత్యంత తక్కువ బంతుల్లోనే 1000 సిక్స్‌లు నమోదు అయ్యాయి. కేవలం 13,079 బంతుల్లో బ్యాటర్లు ఈ ఫీట్‌ను సాధించారు. అంతకుముందు సీజన్‌లో బ్యాటర్లు 15,390 బంతుల్లో వెయ్యి సిక్స్‌ల మార్కును దాటారు. ఇక 2022 ఐపీఎల్‌లో 16,269 బంతుల్లో వెయ్యి సిక్సులు బాదారు.
ఇక మరోవైపు పవర్ ప్లేలో అత్యధిక సిక్స్‌లు కూడా ఈ సీజన్‌లోనే నమోదు అయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఓపెనర్ సంచలనం అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024 సీజన్‌లో పవర్ ప్లేలో ఏకంగా 23 సిక్స్‌లను బాదాడు. ఇక ఇదే టీమ్‌కు చెందిన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఇదే సీజన్‌లో 23 సిక్స్‌లను కొట్టేశాడు. ఇక ఐపీఎల్ 2008 సీజన్‌లో పవర్ ప్లేలో సనత్ జయసూర్య ముంబై ఇండియన్స్ తరఫున ఆడి 22 సిక్స్‌లు కొట్టాడు.
బుధవారం జరిగిన మ్యాచ్‌లు లక్నోపై హైదరాబాద్ సన్‌రైజర్స్ సూపర్ విక్టరీని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆయోష్ బదొని 55 పరుగులు నికోలస్ పూరన్ 48 పరుగులు చేశారు. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా లేకపోవడంతో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్.. అదరగొట్టింది. మొదట్నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించారు. ఒక్క వికెట్ కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేయగా.. 28 బంతుల్లో అభిషేక్ 75 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 14 సిక్సులు బాది అత్యధిక సిక్సులు సాధించిన టీంగా నిలిచింది.