చెన్నై, ఆర్సీబీ.. రెండూ ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే?
IPL 2024 గ్రూప్ దశలో మరో 8 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, ప్లేఆఫ్‌ల రేసు క్లైమాక్స్ దశకు చేరుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2024 2:12 PM ISTచెన్నై, ఆర్సీబీ.. రెండూ ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే?
IPL 2024 గ్రూప్ దశలో మరో 8 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, ప్లేఆఫ్‌ల రేసు క్లైమాక్స్ దశకు చేరుకుంది. కేవలం ఒకే ఒక జట్టు.. KKR - ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. టాప్ లో మూడు స్థానాల కోసం 7 జట్లు రేసులో ఉన్నాయి. ఆదివారం నాడు జరిగిన రెండు మ్యాచ్ లలో CSK, RCB జట్లు.. రాజస్థాన్, ఢిల్లీని ఓడించి విజేతలుగా నిలిచాయి. చెన్నై, బెంగళూరు జట్లు శనివారం బెంగళూరులో తమ ఆఖరి లీగ్ గేమ్‌లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఒకరు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ రెండు జట్లు కూడా ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశం ఉంది.
ముంబై, పంజాబ్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌ల రేసు నుండి వైదొలిగాయి. 12 గేమ్‌లలో 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న గుజరాత్‌కు కూడా ఇంకా అవకాశం ఉంది. 12 గేమ్‌లలో 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న LSGకి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదివారం ఆర్‌సిబి చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఢిల్లీ అవకాశాలకు భారీ దెబ్బ తగిలింది. 3వ స్థానంలో సన్‌రైజర్స్, 4వ స్థానంలో CSK, ఐదో వరుస విజయం తర్వాత 5వ స్థానానికి చేరుకుంది RCB. మంచి నెట్ రన్ రేట్ ఆర్సీబీకి ప్లస్ గా ఉంది.
చెన్నై, బెంగళూరు రెండూ అర్హత సాధించాలంటే?
రెండు జట్లూ ప్లేఆఫ్‌లకు చేరుకోవాలంటే చాలా ఫలితాలు వారికి అనుకూలంగా ఉండాలి. శనివారం జరిగే మ్యాచ్ లో RCB జట్టు CSKని ఓడించాలి, కానీ పెద్ద తేడాతో కాదు. బెంగళూరులో సూపర్ కింగ్స్ ఓడిపోయినా CSK నెట్ రన్ రేట్ పెద్దగా దెబ్బతినకూడదు. SRH మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి 14 పాయింట్లకు పరిమితమవ్వాలి. అంతేకాకుండా SRH భారీ తేడాతో ఓడిపోకూడదు. SRH సొంత గ్రౌండ్ లో మంచి ఫామ్‌లో ఉండడంతో ఇలా జరగడం అసంభవంగా కనిపిస్తోంది. పాట్ కమిన్స్ అండ్ కో ఏకంగా టాప్ 2 కోసం పోటీ పడాలని చూస్తున్నారు.
SRH వారి మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిని గెలిచినా.. CSK, RCB, DC, LSG, GT జట్లకు మరింత కష్టం అవుతుంది, ఎందుకంటే వారు కేవలం ఒక స్థానం కోసం పోటీలో నిలుస్తారు.
ఇక మిగిలిన ఫలితాలను చూసుకుంటే:
అహ్మదాబాద్‌లో కోల్‌కతాపై గుజరాత్ ఓడిపోయి తర్వాతి మ్యాచ్ లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం నాడు ఢిల్లీ లక్నోపై విజయం సాధించింది. లక్నో శుక్రవారం నాడు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవాలి. లేదా లక్నో పెద్ద తేడాతో ముంబైని ఓడించకూడదు. పైన చెప్పిన అన్ని ఫలితాలు అనుకున్నట్లుగా జరిగితే, 4 లేదా 5 జట్లు 14 పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ బాగున్న చెన్నై, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుతాయి.