IPL-2024: రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ

హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మకు ప్రత్యేకం కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on  27 March 2024 5:09 AM GMT
ipl-2024, cricket, mumbai indians, rohit sharma,

IPL-2024: రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ

ఐపీఎల్-2024 సీజన్‌ మ్యాచ్‌లు సందడిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్ని టీమ్‌లు తమ తొలి మ్యాచ్‌లను ఆడాయి. కొన్ని విజయాన్ని అందుకోగా.. ఇంకొన్ని టీమ్‌లు గెలుపు కోసం తర్వాతి మ్యాచ్‌లకు రెడీ అవుతున్నాయి. గుజరాత్‌తో ముంబై ఇండియన్స్‌ తన మొదటి మ్యాచ్‌ను ఆడి ఓడిపోయింది. ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రెండో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఆ టీమ్‌ భావిస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. కాగా.. హోంగ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ గెలుపును నమోదు చేసుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్‌ టీమ్‌ కూడా ఇంతకు ముందు ఒక మ్యాచ్‌ ఆడి అందులో ఓడిపోయింది.

అయితే.. హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మకు ప్రత్యేకం కాబోతుంది. ఈ మ్యాచ్‌తో ముంబై తరఫున రోహిత్‌ 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200.. అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ నిలవబోతున్నాడు. ఈ జాబితాలో ఇప్పటికే విరాట్‌ కోహ్లీ (బెంగళూరు తరఫున 239 మ్యాచ్‌లు) ఉన్నాడు. ఇక ఇతని తర్వాత ఎంఎస్‌ ధోనీ (చెన్నై తరఫున 221 మ్యాచ్‌లు) ముందువరుసలో ఉన్నారు. కాగా.. రోహిత్‌ శర్మ 2011 నుంచి ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు 199 మ్యాచ్‌లు ఆడి.. టీమ్‌ కోసం 5,084 పరుగులు చేశాడు. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా రోహిత్‌ ఉన్నాడు. 2013 సీజన్‌ మధ్యలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత జట్టును ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) వరుసగా చాంపియన్‌గా నిలిపాడు. ఇక 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ నుంచి హార్దిక్‌ పాండ్యాకు ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story