ఐపీఎల్‌-2024 వేలం.. ప‌ది జ‌ట్ల దృష్టి ఆ ఎనిమిది మంది ఆట‌గాళ్ల మీదే..!

ఐపీఎల్‌-2024 ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా వెల్లడైంది. దాదాపు అన్ని జట్లు పేలవ ప్రదర్శన చేసిన‌ ఆటగాళ్లను వ‌దులుకున్నాయి.

By Medi Samrat  Published on  27 Nov 2023 7:22 PM IST
ఐపీఎల్‌-2024 వేలం.. ప‌ది జ‌ట్ల దృష్టి ఆ ఎనిమిది మంది ఆట‌గాళ్ల మీదే..!

ఐపీఎల్‌-2024 ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా వెల్లడైంది. దాదాపు అన్ని జట్లు పేలవ ప్రదర్శన చేసిన‌ ఆటగాళ్లను వ‌దులుకున్నాయి. కొన్ని జ‌ట్లు మాత్ర‌మే కొంత‌మందిపై ఆశ‌లు పెట్టుకుని అట్టిపెట్టుకున్నాయి. వచ్చే నెల డిసెంబర్ 19న వేలం ప్రక్రియ జరుగ‌నుంది. దీంతో అన్ని జట్లు ఈ ఎనిమిది మంది ఆటగాళ్ల కోసం వేలంలో పోటీప‌డ‌నున్నాయి.

ట్రావిస్ హెడ్ :

2023 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా అవ‌డంలో ట్రావిస్ హెడ్ పాత్ర అమోఘం. 137 పరుగుల అత‌డి ఫైనల్ ఇన్నింగ్సు త‌న ఇమేజ్‌ను ఎక్క‌డికో తీసుకెళ్లింది. దీంతో ఫ్రాంచైజీలు ఈ ఓపెనర్ క‌మ్ స్పిన్న‌ర్ కోసం పోటీప‌డ‌నున్నాయి. దీంతో హెడ్ కు భారీ డిమాండ్ ఉంది. ఈ సారి వేలంలో భారీ ధ‌ర ద‌క్కించుకునే ఆట‌గాడిగా అంతా భావిస్తున్నారు.

కైల్ జేమీసన్:

వచ్చే వేలంలో న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్ కోసం గట్టి పోటీ ఉండే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఫాస్ట్‌ బౌలింగ్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడంలో కూడా జేమీసన్‌ నిష్ణాతుడు. 28 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. అతడు తొమ్మిది ఇన్నింగ్స్‌లలో తొమ్మిది వికెట్లు తీయ‌డంతో పాటు ఏడు ఇన్నింగ్స్‌లలో 65 పరుగులు కూడా చేశాడు.

వనిందు హసరంగా:

శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగాను ఈసారి ఆర్సీబీ వేలానికి వ‌దిలేసింది. 26 ఏళ్ల హసరంగా స్పిన్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు. దీంతో హ‌స‌రంగాను ద‌క్కించుకోవ‌డానికి ఈసారి అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

షకీబ్ అల్ హసన్:

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన బౌలింగ్‌తో పాటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డ‌ని కూడా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ఐపీఎల్‌లో పాల్గొన్న సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. దీంతో వేలంలో షకీబ్ కు కూడా డిమాండ్ ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని క్రీడాప్ర‌ముఖులు చెబుతున్నారు.

శార్దూల్ ఠాకూర్:

ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లకు ఎప్పటి నుంచో క్రేజ్ ఉంది. ఆటగాడు ఆల్ రౌండర్ అయితే అతని క్రేజ్ మరింత పెరుగుతుంది. శార్దూల్ ఠాకూర్ ఈసారి వేలంలో అందుబాటులో ఉంటాడు. దీంతో అత‌డిని తీసుకునేందుకు అన్ని జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు.

మిచెల్ స్టార్క్:

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈసారి ఐపీఎల్ వేలంలో ఉండ‌నున్నాడు. 2023 ప్రపంచకప్‌లో కూడా స్టార్క్ మంచి ఫామ్‌లో కనిపించాడు. ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ క‌ప్‌ విజ‌యంలో స్టార్క్ బౌలింగ్ పాత్ర కూడా ఉంది. స్టార్క్ ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడి 26 ఇన్నింగ్స్‌ల్లో 20.38 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. దీంతో అత‌డిని ద‌క్కించుకోవ‌డానికి జ‌ట్లు పోటీప‌డే అవ‌కాశం ఉంది.

డారైల్ మిచైల్‌, రచిన్ ర‌వీంద్ర :

న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్లు డారైల్ మిచైల్‌, రచిన్ ర‌వీంద్ర కూడా ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భారీగా ప‌రుగులు చేశారు. మిచైల్ రెండు సెంచ‌రీలు చేయ‌గా.. రచిన్ మూడు సెంచ‌రీల‌తో పాటు వికెట్లు కూడా ప‌డ‌గొట్టి ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. దీంతో వీరికి వేలంలో గ‌ట్టి ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉంది.

Next Story