రోహిత్‌కు బర్త్‌డే గిఫ్ట్.. ఎట్టకేలకు గెలిచిన ముంబై
IPL 2022 Mumbai Indians Beat Rajasthan Royals by 5 wickets.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ముంబై
By తోట వంశీ కుమార్ Published on 1 May 2022 11:47 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా ఎనిమిది మ్యాచుల్లో ఓటమి పాలైన ముంబై.. తొమ్మిదో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తమ కెప్టెన్ రోహిత్ శర్మకు పుట్టిన రోజు కానుక అందించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (67; 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ రాణించగా.. అశ్విన్ (21; 9 బంతుల్లో 3పోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించాడు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో రాజస్థాన్ ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. అనంతరం ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' సూర్యకుమార్ (51; 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థశతకంతో రాణించగా.. తిలక్ వర్మ (35; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతడికి చక్కని సహకారం అందించాడు. సూర్య, తిలక్ మూడో వికెట్‌కు 56 బంతుల్లో 81 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ (20 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. బర్త్ డే బాయ్ ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలం అయ్యాడు.
ఇది నా బర్త్ డే గిఫ్ట్..
మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ ఆటగాళ్లపై ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ విజయాన్ని ఖచ్చితంగా తన పుట్టిన రోజు కానుకగా స్వీకరిస్తానని అన్నాడు. రాజస్థాన్‌ను ఆ మాత్రం స్కోరుకు కట్టడి చేయడం కష్టమని మాకు తెలుసు. అయితే.. వాళ్లు మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. బట్లర్ కు బౌలింగ్ చేయగానికి షాకీన్ కు బంతి ఇవ్వడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. అతడి బౌలింగ్‌లో బట్లర్ పలు సిక్సర్లు బాదాడు. అయినప్పటికీ చివరికి తన బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాజస్థాన్ ను 10 నుంచి 15 పరుగులు తక్కువకే కట్టడి చేశాం. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. బౌలర్లు సమిష్టిగా రాణిస్తే బ్యాటర్లు తమ పని పూర్తి చేశారు' అని రోహిత్ అన్నాడు.