ఐపీఎల్ 2021.. ఈ సారి తొమ్మిది జ‌ట్ల‌తో..!

IPL 2021 could be played with 9 teams. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ ఇలా ముగిసిందో లేదో వెంట‌నే

By Medi Samrat  Published on  12 Nov 2020 6:36 AM GMT
ఐపీఎల్ 2021.. ఈ సారి తొమ్మిది జ‌ట్ల‌తో..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ ఇలా ముగిసిందో లేదో వెంట‌నే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) 2021 కోసం సిద్ద‌మ‌వుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ సారి సీజ‌న్‌ను ఆల‌స్యంగా నిర్వ‌హించినా.. త‌దుప‌రి సీజ‌న్‌ను షెడ్యూల్ ప్ర‌కార‌మే భార‌త్‌లో నిర్వ‌హిస్తామ‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఐపీఎల్ 14వ సీజ‌న్‌కు మ‌రో ఆరేడు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఇక ఈ సీజన్‌లో మ‌రో కొత్త జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుందని తెలుస్తోంది. క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డిన న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు బీసీసీఐ ఈ కొత్త ప్రాంఛైజీని తీసుకురానుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో పూర్తి స్థాయిలో మెగా వేలాన్ని నిర్వ‌హించేందుకు బీసీసీఐ సిద్ద‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. జనవరి, లేదంటే ఫిబ్రవరిలో వేలం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ ఫ్రాంచైజీ అధికారి ధ్రువీకరించారు.

కొత్తగా వచ్చే ఫ్రాంచైజీ కోసం మొబైల్ అప్లికేషన్ కంపెనీ 'బైజుస్' సౌతిండియా స్టార్, మళయాళం హీరో మోహన్ లాల్ బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన హాజరు కావడం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఫైనల్‌కు మోహన్ ‌లాల్ హాజరయ్యారు. వాస్తవానికి ఈ సీజన్‌లో ప్రేక్షకులకు అనుమతి లేదు. కానీ మోహన్ లాల్ రావడంతో కొత్త ఫ్రాంచైజీ కోసమే వచ్చారని, బైజుస్‌తో కలిసి కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ కూడా దాఖలు చేశారని ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతానికైతే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కనుక వస్తే ఇటీవల ప్రారంభించిన సర్దార్ పటేల్ స్టేడియం దానికి సొంత మైదానం కానుంది. కొత్త ఫ్రాంచైజీ వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ నిబంధనల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కొత్త ఫ్రాంచైజీ వస్తున్నప్పటికీ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండాలని ఓ ఫ్రాంచైజీ పేర్కొంది. ఆటగాళ్లందరినీ వేలానికి ఉంచడం సరికాదని చెబుతున్నారు. బీసీసీఐ స్పందిస్తేనే కానీ అస‌లు సంగ‌తి ఎంటో తెలీదు.


Next Story