జంతర్ మంతర్ చేరుకున్న పీటీ ఉష.. రెజ్లర్లు సమ్మె విరమిస్తారా?

IOA chief PT Usha meets protesting wrestlers. బుధవారం జంతర్ మంతర్ వద్ద సమ్మెలో కూర్చున్న రెజ్లర్లను కలిసేందుకు భారత ఒలింపిక్ సంఘం

By Medi Samrat  Published on  3 May 2023 2:57 PM IST
జంతర్ మంతర్ చేరుకున్న పీటీ ఉష.. రెజ్లర్లు సమ్మె విరమిస్తారా?

బుధవారం జంతర్ మంతర్ వద్ద సమ్మెలో కూర్చున్న రెజ్లర్లను కలిసేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష వచ్చారు. ఆటగాళ్లు ప్రస్తుతం ఈ విష‌యం గురించి మాట్లాడనప్పటికీ.. ధర్నాలో కూర్చున్న క్రీడాకారులతో మాట్లాడి నిర‌స‌న విర‌మ‌ణ‌కు ఒప్పించేందుకు పీటీ ఉష ప్రయత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. అంతకుముందు పీటీ ఉష రెజ్లర్ల ప్రదర్శనను క్రమశిక్షణా రాహిత్యంగా అభివర్ణించారు.

గురువారం జరిగిన భారత ఒలింపిక్ సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం పీటీ ఉష మాట్లాడుతూ.. రెజ్లర్లు వీధుల్లో ప్రదర్శనలు ఇవ్వడం క్రమశిక్షణా రాహిత్యమని, ఇది దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని అన్నారు. ఆమె ప్రకటనపై.. క్రీడాకారులతో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు రోజూ మల్లయోధుల నిరసన స్థలానికి చేరుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్, ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా ఈరోజు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల కులం ఒక్కటే.. ఇది హిందుస్తానీ.. ఈరోజు తర్వాత ఢిల్లీలోని అన్ని గ్రామాల్లో క్రీడాకారులకు మద్దతు లభించేలా పంచాయతీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కూతుళ్లను అవమానిస్తే ఎవరూ అంగీకరించరని సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ రెజ్లర్ల సమ్మె నేటికీ 11వ రోజు కొనసాగుతోంది. పోక్సో, వేధింపుల కింద బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత.. అతనిని అరెస్టు చేయాలని ధర్నాలో కూర్చున్న రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు మైనర్‌తో సహా 7 మంది మహిళా ఆటగాళ్ల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దేవేంద్ర యాదవ్‌ కూడా మంగళవారం జంతర్‌మంతర్‌కు చేరుకుని నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా. నిరసనలో ఉన్న వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా ఇతర రెజ్లర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవేంద్ర యాదవ్ రెజ్లర్లకు తన మద్దతు ఇస్తూ.. “ఈ రోజు మా సోదరులు, మా సోదరీమణులు, మా కుమార్తెలు న్యాయం కోసం జంతర్ మంతర్ వద్ద కూర్చున్నారు, వారికి న్యాయం జరగకపోతే, ఇంతకంటే పెద్ద కుట్ర మరొకటి లేదు. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విష‌య‌మ‌న్నారు.


Next Story