2025 ఐపీఎల్ సీజన్‌లో దారుణమైన ప్రదర్శన చేస్తున్న జట్లలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. వరుసగా 5 మ్యాచ్ లలో చెన్నై జట్టు ఓటమి పాలైంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అద్భుతంగా ఆడి విజయాన్ని అందించాడు. అయితే ధోని కుంటుతున్నట్లు కొన్ని దృశ్యాలు చెన్నై జట్టును ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి.
కీపింగ్ చేస్తున్నప్పుడు కూడా ధోని అసౌకర్యంగా కదిలాడు. అబ్దుల్ సమద్‌ను రనౌట్ చేసిన తర్వాత, ధోని బ్యాలెన్స్ ను కాపాడుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. సూపర్ కింగ్స్ జట్టుకు చివరి ఐదు ఓవర్లలో ఓవర్‌కు 10 పరుగులు కంటే ఎక్కువ అవసరమైనప్పుడు ధోని మంచి బ్యాటింగ్ ఆడాడు. శివం దూబేతో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యంలో భాగమయ్యాడు. కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ మెట్లు దిగుతున్నప్పుడు కూడా ధోని కుంటుతూ కనిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడానికి వచ్చినప్పుడు కూడా ధోని స్వేచ్ఛగా నడవలేకపోయాడు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ సేవలను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ ధోని గాయం విషయంలో కూడా టెన్షన్ పడుతూ ఉంది.