సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తదుపరి రెండు గేమ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని అన్నారు. అతడి బౌలింగ్ హ్యాండ్‌లో స్ప్లిట్ వెబ్‌బింగ్‌తో బాధపడుతూ ఉండడంతో వచ్చే రెండు గేమ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో, వాషింగ్టన్ గాయపడ్డాడు. అతని పూర్తి కోటా ఓవర్లను బౌల్ చేయలేకపోయాడు. "వాషింగ్టన్ కుడిచేతిలో, బొటనవేలు, మొదటి వేలు మధ్య ఉన్న వెబ్‌బింగ్ నలిగిపోయింది. మేము దానిని రాబోయే రెండు-మూడు రోజులలో పర్యవేక్షించాలి. ఇది పెద్ద దెబ్బ కాదు. బహుశా అతడు బౌలింగ్ చేయడానికి కొంత సమయం పడుతుందని నేను భావిస్తున్నాను. పూర్తిగా నయం అవ్వడానికి వారం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది" అని విజయం తర్వాత SRH కోచ్ మూడీ చెప్పాడు. సన్‌రైజర్స్ తమ తదుపరి రెండు మ్యాచ్ లలో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది.
కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న ఆ జట్టుకు టోర్నీలో తొలి ఓటమి రుచిచూపింది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 163 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే, కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత ఓపెనర్లు అభిషేక్ శర్మ (42), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57) సరైన పునాది వేయగా, చివర్లో నికోలాస్ పూరన్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 నాటౌట్) మ్యాచ్ ను ముగించాడు.