డిసెంబర్ 22న మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ కు కూడా రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఛటోగ్రామ్‌లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన రోహిత్ రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆడడం లేదు. భారత్ 1-0తో ఆధిక్యంలో ఉన్న ఈ సిరీస్‌లో రెండోది, చివరి టెస్టులో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో రోహిత్ గాయపడ్డాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో క్యాచ్ ని పట్టుకునే ప్రయత్నంలో రోహిత్ బొటనవేలిని బంతి బలంగా తాకింది. ఈ క్రమంలో అతడు క్యాచ్ కూడా జారవిడిచాడు. అప్పటికే బొటన వేలి నుంచి రక్తం కారుతుండటంతో మైదానం వీడాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రిలో స్కానింగ్ కోసం పంపించారు. గాయంతో కూడా రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత మూడో వన్డేకు దూరమయ్యాడు. ఇక టెస్ట్ సిరీస్ లో కూడా ఆడలేదు. ప్రస్తుతం ముంబైలో ఉన్న రోహిత్ టెస్టులో బ్యాటింగ్ చేయగలడు, అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రిస్క్ తీసుకోవడం అవసరమా అనే ఆందోళనలు వెంటాడుతూ ఉండడంతో బీసీసీఐ రిస్క్ తీసుకోవట్లేదని తెలుస్తోంది.