వాంఖడేలో టీమిండియా పరుగుల వరద.. 97 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

By Knakam Karthik  Published on  3 Feb 2025 7:01 AM IST
Sports News, T20 match against England, India, Abhisek Sharma

వాంఖడేలో టీమిండియా పరుగుల వరద.. 97 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన భారత్‌, ఇంగ్లండ్ ఐదో టీ20 మ్యాచ్‌ లో భారత్ భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్‌ కుప్పకూలింది. 248 పరుగుల భారీ టార్గెట్‌కు దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్​ అయ్యింది. దీంతో భారత్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా 4-1తో విజయవంతంగా ముగించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్ బౌలింగ్‌ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇందులో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చి పరుగుల వరద పారించాడు. కేవలం 54 బంతుల్లో 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. అలాగే తిలక్ వర్మ 24, శివమ్ దుబే 30 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, మార్క్‌వుడ్ 2, రషీద్ 1, ఆర్చర్ 1 వికెట్లు తీసుకున్నారు.

ఇంగ్లాండ్‌ టీమ్‌లో ఫిల్‌ సాల్ట్‌ 55(23), జాకబ్‌ బెతల్‌ 10(7)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌దుబే, అభిషేక్‌శర్మలు రెండేసి వికెట్లు, రవి బిష్ణోయ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. భారీ టార్గెట్‌తో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కు ఫిల్‌ సాల్ట్‌ 55(23) దూకుడుగా ఆడి శుభారంభాన్ని ఇచ్చాడు. సాల్ట్​ 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, టీమ్ఇండియా బౌలర్లు విజృంభించడం వల్ల కెప్టెన్‌ బట్లర్‌ 7(7) సహా మిగతా ప్లేయర్లంతా చేతులెత్తేశారు. దీంతో ఐదో ఓవర్‌ నుంచి ప్రతి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

Next Story