చరిత్ర సృష్టించిన భార‌త‌ మహిళల ఆర్చరీ జట్టు

Indian women's compound team wins historic Gold medal. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్-2023లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది.

By Medi Samrat
Published on : 4 Aug 2023 9:09 PM IST

చరిత్ర సృష్టించిన భార‌త‌ మహిళల ఆర్చరీ జట్టు

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్-2023లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. శుక్రవారం బెర్లిన్‌లో జ్యోతి సురేఖ వెన్నం, ప్రణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామిలతో కూడిన భారత మహిళల జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఏ విభాగంలోనైనా భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. స్వర్ణ పతకం కోసం జరిగిన ఫైనల్లో భారత జట్టు 235-229తో మెక్సికన్ జట్టు డాఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెర్రాలను ఓడించింది.

క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచిన భారత జోడీ సెమీ ఫైనల్‌లో 220-216తో డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబియాను ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. తొలి రౌండ్‌లో బై పొందిన తర్వాత.. భారత మహిళల కాంపౌండ్ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీ, ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో టర్కీని ఓడించింది. భారత్ తొలి ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో 9 స్వర్ణాలు, 2 రజతాలతో సహా 11 పతకాలు సాధించింది.

మహిళా క్రీడాకారులను అభినందిస్తూ.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. మహిళల జట్టు ఫైనల్‌లో 235-229 తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఇది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఇండియాకు మొదటి స్వర్ణం. అమ్మాయిలు మీకు అభినందనలు.. మీ విజ‌యం ప‌ట్ల‌ చాలా గర్వంగా ఉందని పేర్కొంది.

చరిత్ర సృష్టించిన భార‌త‌ మహిళల ఆర్చరీ జట్టుకేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌లో.. "ముగ్గురు ఆర్చర్లకు హ్యాట్సాఫ్.. భారతదేశాన్ని విజయపథంలో నడిపించిన మీ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం నిజంగా అసాధారణమైనది. టోర్నమెంట్‌లో సవాళ్లను మరింత దృఢ సంకల్పంతో ఎదుర్కొన్న తీరు అసాధారణమైనది. మీ ప్రదర్శన స్ఫూర్తిదాయకం. దేశంలోని ఆడపిల్లలు మీ విజ‌యం ప‌ట్ల‌ గర్వపడుతున్నారు, మీరు భారతదేశం గర్వపడేలా చేసారు. మీకు అభినందనలు అని రాసుకొచ్చారు.

Next Story