ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవే కావొచ్చు..!

IPL 2025 ఆటగాళ్ల మెగా ఆక్ష‌న్‌ కోసం క్రికెట్ అభిమానులందరూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

By Kalasani Durgapraveen  Published on  4 Nov 2024 10:19 AM GMT
ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవే కావొచ్చు..!

IPL 2025 ఆటగాళ్ల మెగా ఆక్ష‌న్‌ కోసం క్రికెట్ అభిమానులందరూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం.. సౌదీ అరేబియాలోని రియాద్‌లో నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వేలం జరిగే వేదిక, తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని వర్గాలు సూచించాయి.

మూలాధారాలను విశ్వసిస్తే.. వేలం తేదీ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మొదటి టెస్ట్ స‌మ‌యంలో జ‌రుగ‌నుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుంచి 26 వరకు పెర్త్‌లో జరగనుంది. అయితే.. ఐపీఎల్ 2025లో చాలా మంది ఆటగాళ్ల భవితవ్యం ప్రమాదంలో ఉంది. ఈసారి రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి భారత స్టార్లు కూడా వేలంలోకి ప్రవేశించనున్నారు. వీరిని వారి జట్లు రిటైన్ చేయలేదు. అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ కూడా వేలంలో భాగం కానున్నారు. అన్ని ఫ్రాంచైజీలు ఇటీవలే తమ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. అయితే వేలంలో ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే అందరి దృష్టి ఉంటుంది.

శ్రేయాస్ అయ్యర్ తన కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)ని ఐపీఎల్ 2024 విజేత‌గా నడిపించగా.. పంత్ చాలా కాలం పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లను ఏ జట్టు తీసుకున్నా కెప్టెన్ ఎంపిక కూడా ఉంటుంది. గత కొంత కాలంగా ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్‌కు జట్లు పెద్దపీట వేయవచ్చు.

నివేదిక ప్రకారం.. BCCI అధికారులు సౌదీ అరేబియా సందర్శించారు. వేదికను కూడా పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో మరో బీసీసీఐ ప్రతినిధి బృందం కూడా సౌదీకి వెళ్లి విషయాలు ఖరారు చేస్తుందని విశ్వసనీయ సమాచారం. మెగా వేలం జెడ్డా, రియాద్ ల‌లో నిర్వ‌హించేందుకు బీసీసీఐ బృందం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బీసీసీఐ ఇంతకుముందు కూడా దేశం వెలుపల వేలం నిర్వహించింది. దుబాయ్, సింగపూర్, వియన్నాలో వేలం నిర్వహించాలని బోర్డు భావించింది.. అయితే సౌదీ అరేబియా వాటి కంటే ముందుంది.


Next Story