మధ్యప్రదేశ్ లోని ఇండోర్, హోల్కర్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ మూడో మ్యాచ్ ను కూడా గెలవాలని భావిస్తోంది. ఇక భారత క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లారు. కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని మహాకాళేశ్వర ఆలయంలో పలువురు భారత క్రికెటర్లు పూజల్లో పాల్గొన్నారు. శివుడికి ఇచ్చే ‘భస్మ హారతి’కి కూడా వారు హాజరయ్యారు. ఉదయం సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ భారత క్రికెట్ టీమ్ కు చెందిన కొందరు సిబ్బందితో కలిసి మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో వారంతా ఆలయానికి చేరుకున్నారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకుని జట్టులో చేరాలని దేవుడిని ప్రార్థించామని సూర్యకుమార్ యాదవ్ మీడియాకు చెప్పాడు.
జనవరి 24న ఇండోర్ లో జరగబోయే మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీస్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. హోల్కర్ క్రికెట్ స్టేడియం పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించనుంది. హోల్కర్ స్టేడియంలో టీమిండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 5 వన్డే మ్యాచ్ లు జరగగా.. 3సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, 2సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది.