భారత మహిళా క్రికెటర్లు ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చారు. ఆదివారం మాకేలోని హరప్ పార్క్‌లో జరిగిన మూడవ మరియు చివరి వన్డేలో రెండు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా మహిళల రికార్డు 26 మ్యాచ్‌ల అజేయ పరంపరను ముగించడానికి భారత మహిళలు చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచారు. 265 పరుగుల లక్ష్యాన్ని 3 బంతులు మిగిలి ఉండగానే చేరుకున్నారు. 2017 లో చివరిగా వన్డే మ్యాచ్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ఇప్పుడు ఓటమిని చవి చూసింది. సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 30 న క్వీన్స్‌ల్యాండ్‌లోని కారారా ఓవల్‌లో రెండు జట్ల పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
భారత్ రెండో వన్డేలో చివరి బంతికి ఓడిపోయింది. నో బాల్ వివాదాస్పద నిర్ణయం కారణంగా భారత్ ఆ మ్యాచ్ లో ఓటమిని అందుకుంది. మూడో వన్డేలో మాత్రం ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ ను భారత్ బ్యాటింగ్ నిలువరించింది. ఛేజింగ్‌లో షఫాలి వర్మ (91 బంతుల్లో 56), యస్తికా భాటియా (69 బంతుల్లో 64) రాణించారు. దీప్తి శర్మ (30 బంతుల్లో 31) మరియు స్నేహ్ రాణా (27 బంతుల్లో 30) కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో భారతదేశం అత్యుత్తమ రన్-ఛేజ్‌ని నమోదు చేసింది.ఝులన్ గోస్వామికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.