ఇలాంటి బౌలింగ్ స్పెల్ చూసి చాలా కాలమైంది
India win by 44 runs to take unassailable 2-0 lead.మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2022 12:43 PM ISTమూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమ్ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు), కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించారు.
అనంతరం 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అకీల్ హోసీన్ (34), ఓడియన్ స్మిత్ (24) రాణించినా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఈ నెల 11న జరగనుంది.
ఇక భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. సిరీస్ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కొన్ని సవాళ్లు ఎదురైయ్యాయి. అయితే.. బ్యాటింగ్‌లో రాహుల్, సూర్యకుమార్ యాదవ్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారిద్దరూ ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేశారు. ఒత్తిడిలో ఇలా ఆడటం జట్టుకు ఎంతో కీలకం. దీంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించాం.
మేము ఆ స్కోర్‌ను డిఫెండ్ చేయగలమని భావించాం. మా బౌలర్లు అదే చేసి చూపించారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన పేస్‌తో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లను ముప్పు తిప్పలు పెట్టాడు. చాలాకాలంగా భారత పిచ్‌ల మీద ఇలాంటి స్పెల్‌ను చూడలేదు. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో కొన్ని ప్రమోగాలని చేయాలని బావించాను. అందులో భాగంగానే పంత్‌ను ఓపెనింగ్‌కు తీసుకువచ్చాను. ఇక తదుపురి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఆడే అవకాశం ఉంది అని రోహిత్ చెప్పాడు.