గెలిస్తే సెమీస్‌కు భారత్.. నేడు జింబాబ్వేతో పోరు
India Vs Zimbabwe T20 World cup Match Today. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది.
By తోట వంశీ కుమార్ Published on 6 Nov 2022 2:50 AM GMTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో భారత జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. సూపర్-12 దశలో జింబాబ్వేతో చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఎలాంటి సమీకరణాలు లేకుండా టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే జింబాబ్వేపై విజయం సాధించాల్సిందే. లేదంటే ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. మూమూలుగా అయితే జింబాబ్వేతో మ్యాచ్ అంటే దాదాపుగా ఫలితం ఏంటో ఓ అంచనాకు వచ్చేయొచ్చు.
అయితే.. ప్రస్తుత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు జింబాబ్వే గట్టి షాకే ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా జాగ్రత్తగా ఆడాల్సిందే. ఇక భారత-జింబాబ్వే మ్యాచ్‌ల కంటే ముందు దక్షిణాఫ్రికాతో నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ ఫలితాలను బట్టి సెమీస్ బెర్తులు దాదాపుగా ఖారారు అవుతాయి. నేడు జరిగే మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధిస్తే గ్రూప్-2 నుంచి అగ్రస్థానంతో సెమీస్‌కు చేరుతుంది. అప్పుడు గ్రూప్-1 నుంచి సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంటుంది.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్‌లు అద్భుత ఫామ్‌లో ఉండడం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. అయితే.. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మంచి ఆరంభాన్ని అందించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. వీరితో పాటు ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌లు కూడా ఓ చేయి వేస్తే ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు.
అశ్విన్, అక్షర్ పటేల్‌లు విఫలం అవుతున్నప్పటికీ కెప్టెన్, కోచ్‌ల అండ ఉండడంతో వారి స్థానాలకు ఢోకా లేదు. రిషబ్ పంత్, చాహల్, హర్షల్ పటేల్ లాంటి వాళ్లు తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. మరి జింబాబ్వేతో మ్యాచులో అయినా వీరికి అవకాశం దక్కుతుందేమో చూడాలి. అర్ష్ దీప్ సింగ్, షమీ, భువనేశ్వర్ కుమార్ పేస్ భారాన్ని మోయనుండగా అశ్విన్ పరుగుల నియంత్రణపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తున్న జింబాబ్వేను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. సికిందర్ రాజా, సీన్ విలియమ్స్, ముజరబాని, ఎంగర్వ లాంటి ప్రతిభావంతులు ఆ జట్టు సొంతం. వీరు నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి తోడు కెప్టెన్ ఎర్విన్ బ్యాటింగ్ లో కీలకం.
మెల్‌బోర్న్ పిచ్ పేసర్లకే అనుకూలం. ఆరంభంలో ఫాస్ట్ బౌలర్ల కాచుకోవడం కష్టమే. నిలదొక్కుకుంటే పరుగులు చేయడం కష్టం కాదు.