సెంచూరియన్ టెస్టు.. తొలి రోజు ఆట పూర్తి.. రాహుల్ సెంచ‌రీ చేసేనా..?

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం అయ్యింది.

By Medi Samrat  Published on  26 Dec 2023 4:01 PM GMT
సెంచూరియన్ టెస్టు.. తొలి రోజు ఆట పూర్తి.. రాహుల్ సెంచ‌రీ చేసేనా..?

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం అయ్యింది. తొలిరోజు ఆరంభంలోనే ఆతిథ్య జట్టు బౌలర్లు భారత టాప్ ఆర్డర్‌ను చిత్తు చేశారు. విరాట్ కోహ్లీ(38), శ్రేయాస్ అయ్యర్(31) కాసేపు క్రీజులో నిలిచినా.. పెద్ద ఇన్నింగ్సులుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత‌.. తొలిరోజు ఆట ముగిసే వరకు 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కేఎల్ రాహుల్ అత్యుత్తమ బ్యాటింగ్ చేశాడు. వర్షం కారణంగా తొలిరోజు ఆట 59 ఓవర్లు మాత్రమే సాధ్య‌ప‌డగా.. 8 వికెట్లు కోల్పోయి టీమిండియా 208 ప‌రుగులు చేసింది.

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రాణించ‌డం ద్వారా టెస్ట్ క్రికెట్‌లో 14వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. అంతే కాదు అంతర్జాతీయ క్రికెట్‌లో రబడ 500 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. రబాడ బౌలింగ్‌ ముందు భారత బ్యాట్స్‌మెన్‌ నిల‌వ‌లేక‌పోయారు. అరంగేట్రం చేసి బౌల‌ర్‌ నాంద్రే బెర్గర్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. బెర్గర్.. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లను పెవిలియన్‌కు పంపాడు. మార్కో జాన్సన్ కూడా వికెట్ ప‌డ‌గొట్టాడు.

అయితే.. భార‌త బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ మాత్రం అందరి హృదయాలను గెలుచుకునే విధంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడి ఇన్నింగ్సు కార‌ణంగానే భారత జట్టు స్కోరు 200 దాటింది. ప్ర‌స్తుతం రాహుల్ 105 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, రెండు అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నాడు. రేప‌టి ఆట‌లో సిరాజ్ మద్దతు ఇస్తే రాహుల్ సెంచరీని పూర్తి చేసే అవ‌కాశం ఉంది.

ఇదిలావుంటే.. శార్దూల్ ఠాకూర్‌ను సౌతాఫ్రికా పేసర్లందరూ ఇబ్బంది పెట్టారు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్, నాండ్రే బెర్గర్, కగిసో రబడా బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో అతనిపై దాడికి దిగారు. అయిన‌ప్ప‌టికీ శార్దూల్ 33 బంతుల్లో 24 పరుగులు చేసి విలువైన ప‌రుగులు అందించాడు. ఏడో వికెట్‌కు రాహుల్‌తో కలిసి 43 పరుగుల ఉపయోగకరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు వీలైన‌న్ని ఎక్కువ ప‌రుగులు చేయాల‌ని టీమ్ ఇండియా భావిస్తుంది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ‌ రాహుల్‌కు ఎంతవరకు మద్దతు ఇవ్వగలరనే దానిపై టీమిండియా స్కోరు ఆధారపడి ఉంటుంది.

Next Story