దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్ చేరిన భారత హాకీ జట్టు
భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ఆటతీరుతో సెమీ-ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకుంది
By Medi Samrat Published on 16 Sep 2024 12:45 PM GMTభారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ఆటతీరుతో సెమీ-ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన చైనాతో భారత్ ఫైనల్‌లో తలపడనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత భారత జట్టు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి అజేయంగా నిలిచింది. మంగళవారం భారత్-చైనాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే రికార్డు స్థాయిలో ఐదో టైటిల్ కైవసం చేసుకుంటుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. మూడో క్వార్టర్‌లో జిహున్ యాంగ్ ద్వారా దక్షిణ కొరియాకు ఏకైక గోల్ లభించింది. దక్షిణ కొరియాపై భారత్ తొలి క్వార్టర్‌లోనే ఆధిక్యాన్ని కొనసాగించింది. మొదట ఉత్తమ్ సింగ్ గోల్ చేసి భారత్‌ను 1-0తో ముందంజలో ఉంచాడు. దీని తర్వాత రెండో క్వార్టర్‌లోనూ భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. రెండో క్వార్టర్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ దక్షిణ కొరియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది.
మూడో క్వార్టర్‌లోనూ దక్షిణ కొరియాపై భారత పురుషుల హాకీ జట్టు ఆధిక్యాన్ని కొనసాగించింది. దక్షిణ కొరియా హాఫ్ టైమ్ తర్వాత పునరాగమనం చేసి గోల్ కొట్టే ప్రయత్నం చేసినా భారత్‌ను అధిగమించలేకపోయింది. మూడో క్వార్టర్‌లో కొరియా తరఫున జిహున్ యాంగ్ గోల్ చేయగా.. భారత్ తరఫున జర్మన్‌ప్రీత్ సింగ్ కూడా మూడో గోల్ చేశాడు. దీని తరువాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో రెండవ గోల్ చేశాడు, దీంతో దక్షిణ కొరియాపై భారత్ 4-1 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణ కొరియా చివరి వరకు ఆధిక్యం కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు.
అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడడం ఇది 62వ సారి. 1958లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఇరు జట్లు తొలిసారి తలపడ్డాయి. భారత్ 39 మ్యాచ్‌లు, దక్షిణ కొరియా 11 మ్యాచ్‌లు గెలుపొందాయి. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.