ఐదో టీ20 వర్షార్పణం.. ట్రోఫిని పంచుకున్న భారత్, దక్షిణాఫ్రికా
India Vs South Africa Fifth T20 Abandoned Due To Rain.తొలి రెండు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా అద్భుతంగా
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2022 8:40 AM ISTతొలి రెండు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు తరువాతి రెండు మ్యాచుల్లో గెలిచింది. దీంతో అందరి దృష్టి నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్‌పైనే పడింది. ఈ మ్యాచులో విజయం సాధించి టీమ్ఇండియా మరో సిరీస్ కైవసం చేసుకుంటుందా..? లేక సపారీలు ట్రోఫీ పట్టుకెలుతారా..? అన్న ఆసక్తి నెలకొంది. టాస్ పడింది. భారత్ బ్యాటింగ్ మొదలెట్టింది. అయితే.. అటు దక్షిణాఫ్రికా, ఇటు భారత్ గెలవలేదు. తాను ఉన్నానంటూ వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. పలుమార్లు సమీక్ష నిర్వహించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లు(భారత్, దక్షిణాఫ్రికా) జట్లు సిరీస్‌ను పంచుకున్నాయి.
వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో ఒక్కో ఓవర్‌ను తగ్గిస్తూ 19 ఓవర్లకు ఆటను కుదించారు. టీమ్ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది ఇషాన్ కిషన్ (15; 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చేలా కనిపించాడు. అయితే.. లుంగి ఎంగిడి వరుస ఓవర్లలో ఇషాన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (10; 1 ఫోర్) ను వెనక్కి పంపాడు. ఇషాన్ కిషన్ బౌల్డ్ అవ్వగా.. బంతిని మిడాన్‌లో గాల్లోకి లేపి రుతురాజ్ పెవిలియన్ చేరాడు.
క్రీజులోకి వచ్చిన పంత్ ఒక్క బంతిని ఎదుర్కోగానే మళ్లీ వర్షం దంచి కొట్టింది. అప్పటికి భారత్ 3.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. కుండపోత వర్షం కురియడంతో కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. రిజర్వు డే లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా స్టేడియం నుంచి వెనుదిరిగారు. నాలుగు మ్యాచ్‌ల్లో పొదుపుగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టిన భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'అవార్డు దక్కింది.