భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌కు మంచు కారణంగా వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, మ్యాచ్ కోసం టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు పూర్తి డబ్బులు తిరిగి ఇస్తామని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) హామీ ఇచ్చింది. టికెట్ల రిఫండ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుందని క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్నవారికి ఆన్‌లైన్‌లోనే డబ్బులు వాపస్ వస్తాయని, కేవలం సర్వీస్ ఛార్జీలు మాత్రమే మినహాయించుకొని మిగతా మొత్తం రిఫండ్ చేస్తామన్నారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొన్నవారి కోసం ఏకానా స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నాలుగో టీ20 మ్యాచ్ కు సంబంధించి అంపైర్లు కేఎన్ అనంతపద్మనాభన్, రోహన్ పండిట్ మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అనంతరం, పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో, మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది.