IND vs PAK చివరిగా ఆడిన‌ మ్యాచ్ ఫలితం ఏంటో తెలుసా?..

ఆసియా కప్ 2023 మూడో మ్యాచ్‌లో.. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

By Medi Samrat  Published on  1 Sept 2023 7:43 PM IST
IND vs PAK చివరిగా ఆడిన‌ మ్యాచ్ ఫలితం ఏంటో తెలుసా?..

ఆసియా కప్ 2023 మూడో మ్యాచ్‌లో.. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. వన్డే ఫార్మాట్‌లో ఇరు జట్లు తలపడి నాలుగేళ్లు పూర్తి కావస్తుండటంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆసియా కప్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నేపాల్‌పై 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ జట్టు ఆత్మవిశ్వాసంతో బ‌రిలో దిగుతుండ‌గా.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు రికార్డు కూడా పాకిస్థాన్‌పై బాగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్.. ఎప్పుడు జరిగింది, ఆ మ్యాచ్ ఎలాంటి ఫలితాన్నిచ్చిందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

అది 16 జూన్ 2019. 2019 ప్రపంచ కప్ మ్యాచ్ ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. పాకిస్థాన్ అభిమానులు పొరపాటున కూడా ఈ మ్యాచ్‌ను మరిచిపోరు. ఈ మ్యాచ్‌లో పాక్‌ జట్టు టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది.

ఆ నిర్ణయం త‌ప్ప‌ని పాకిస్థాన్‌కు కాసేప‌ట్లోనే తేలింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీని తర్వాత హిట్‌మన్ విరాట్ కోహ్లితో కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా 26 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్‌కు భారత్ 337 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే ఈ మ్యాచ్‌లో వర్షం పడడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించడంతో పాకిస్థాన్ కు ఎదుట‌ 302 పరుగుల లక్ష్యం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కేవలం 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ప్రపంచకప్‌లో టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధిని ఓడించింది.

1978లో తమ తొలి మ్యాచ్‌ నుంచి భారత్‌, పాకిస్థాన్‌లు 132 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. పాకిస్థాన్ 73 విజయాలతో ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా 55 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మ‌రో నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

Next Story