న్యూజిలాండ్‌తో భారత్ తొలి టీ20 నేడే.. కుర్రాళ్లకు పరీక్షే..!
India vs New Zealand 1st T20I Match today.పాండ్య సారథ్యంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడేందుకు
By తోట వంశీ కుమార్ Published on 18 Nov 2022 10:33 AM ISTఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ల గైర్హాజరీలో యువకులతో కూడిన భారత జట్టు హార్థిక్ పాండ్య సారథ్యంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. తొలిసారి భారత జట్టు పగ్గాలు అందుకున్న హార్థిక్ యువకులతో కూడిన జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి.
2024 టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఇప్పటి నుంచే సిద్దం చేసే పనిలో ఉన్నట్లు సెలక్టర్లు తెలిపిన సంగతి తెలిసిందే. అందుకనే యువ క్రికెటర్లకు సత్తాను పరీక్షించేందుకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్, రాహుల్‌లు లేకపోవడంతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటికే తనను తాను గిల్ నిరూపించుకోగా.. టీ20ల్లో అరంగ్రేటం లాంఛనమే.
విరాట్ కోహ్లీ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ భారం మొత్తం సూర్యకుమార్‌పైనే ఉంది. దినేశ్ కార్తీక్ కారణంగా ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన పంత్.. ఈ సిరీస్‌లో అటు కీపర్‌గా ఇటు బ్యాటర్‌గా కీలకం కానున్నాడు. శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్‌లలో ఎవరికి తుది జట్టులో మేనేజ్‌మెంట్ అవకాశం ఇస్తుందో చూడాలి. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
బుమ్రా లేకపోవడంతో ప్రపంచకప్‌లో భారత బౌలింగ్ బలహీనంగా మారిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయం కారణంగా బుమ్రా న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. బుమ్రా గైర్హాజరీలో కివీస్ పిచ్‌లపై భువనేశ్వర్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తోడు ఉమ్రాన్ మాలిక్ ఎలా రాణిస్తారో చూడాలి. చాహల్. కుల్‌దీప్‌లు స్పిన్ భారాన్ని మోయనున్నారు. రెగ్యులర్ కోచ్ ద్రావిడ్‌కు విశ్రాంతిని ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ తాతాల్కిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.