హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్ కు చేరుకోలేకపోయింది. జర్మనీ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. పెనాల్టీ కార్నర్ లను కనీసం గోల్స్ ను మలిచే ట్యాలెంట్ భారత ఆటగాళ్లకు లేదా అని మ్యాచ్ చూసిన సమయంలో అనిపించింది. మలేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన సెమీస్‌లో జర్మనీ చేతిలో 4-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. 8వ నిమిషంలోనే ఫీల్డ్ గోల్‌తో హస్బాచ్ బెన్ జర్మనీ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 11వ నిమిషంలో భారత్ తరఫున సుదీప్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. హస్బాచ్ బెన్ 30వ నిమిషంలో మరో గోల్ చేయగా.. గ్లాండెర్ పాల్, స్పెర్లింగ్ ఫ్లోరియన్ చెరో గోల్ చేయడంతో జర్మనీ మ్యాచ్ లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.
భారత జట్టు మూడో స్థానం కోసం పోరాడనుంది. ఈ నెల 16న జరిగే మ్యాచ్‌లో ఫ్రాన్స్ లేదా స్పెయిన్‌తో భారత్ తలపడనుంది. 2021 ప్రపంచకప్ సెమీస్‌లోనూ భారత్ 2-4 తేడాతో జర్మనీ చేతిలోనే ఓడింది. 2001, 2016 ప్రపంచకప్‌ల్లో భారత్ విజేతగా నిలిచింది.